
- ఇదే అదనుగా బ్రోకర్ల దందా
- ఒక నోటు ఎక్స్చేంజ్కు రూ.300 వరకు కమీషన్
హైదరాబాద్, వెలుగు : రూ.2 వేల నోట్ల ఎక్స్చేంజ్ ఇంకా కొనసాగుతోంది. ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ఆఫ్ ఇండియా) ఆఫీసులో ఎక్స్చేంజ్కు అవకాశం ఉండటంతో ప్రతి రోజు సిటీలోని రీజినల్ ఆఫీసుకు జనం తరలివస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చుని నోట్లను మార్చుకుంటున్నారు. రూ.2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ఈ ఏడాది మే 19న ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 23 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో ఎక్స్ చేంజ్ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. అక్టోబర్ 8 నుంచి హైదరాబాద్ సహా దేశంలోని 19 ఆర్బీఐ రీజినల్ ఆఫీసుల్లో మాత్రమే ఎక్స్చేంజ్కు అవకాశం కల్పించింది.
ప్రస్తుతం దీనిద్వారా రూ.20 వేల వరకు రూ.2 వేల నోట్లను ఎక్స్ చేంజ్ లేదా డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే, బ్యాంకుల్లో ఎక్స్చేంజ్కు ఆర్బీఐ విధించిన గడువు ముగిసి 2 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ రూ.2 వేలు నోట్లను మార్చుకునేందుకు సిటీలోని రీజినల్ ఆఫీసు వద్ద జనం క్యూ కడుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, కర్నాటక, ఏపీ నుంచి సిటీకి వచ్చి ఆర్బీఐ రీజినల్ ఆఫీసు వద్ద నోట్లను ఎక్స్ చేంజ్ చేసుకుంటున్నారు.
లైన్లలో నిలబడలేక..
ఆర్బీఐ రీజినల్ ఆఫీసు వద్ద గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడలేని వారు బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. ఆర్బీఐ ఆఫీసు వద్ద దాదాపు 10 మంది వరకు బ్రోకర్లు ఉన్నట్లు సమాచారం. రూ.2 వేల నోటు ఒకటి ఎక్స్ చేంజ్ చేసేందుకు వీరు రూ.200 నుంచి రూ.300 వరకు కమీషన్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు బ్రోకర్లతో రూ.లక్షల్లో నోట్ల మార్పిడికి డీల్ మాట్లాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బ్రోకర్లే కొంతమందికి కమీషన్ ఇచ్చి లైన్లలో నిలబెట్టి నోట్ల మార్పిడి చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
2.7 శాతం నోట్లు చలామణిలో..
డిసెంబర్1 నాటికి దేశంలో రూ.9,760 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయని.. 97.26 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ గతంలో నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2.7 శాతం నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మే 19న ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నప్పడు 3.56 లక్షల కోట్లు చలామణిలో ఉండేవని.. నవంబర్ 30 నాటికి ఆ సంఖ్య రూ. 9,760 కోట్లకు తగ్గిందని నివేదికలో పేర్కొంది.
రూ.8 వేలు మార్చుకునేందుకు వచ్చిన..
కొంతకాలంగా మా కూతురికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో హాస్పిటల్స్ చుట్టూ తిరిగాం. అందుకే గడువులోగా రూ.2 వేల నోట్లను ఎక్స్ చేంజ్ చేసుకోలేకపోయా. ఇంట్లో రూ.2 వేల నోట్లు నాలుగు ఉండటంతో ఆర్బీఐ ఆఫీసుకు వచ్చి వాటిని ఎక్స్ చేంజ్ చేసుకున్నా.
రమేశ్, రైతు, సిద్దిపేట
అమ్మకు తెలియకపోవడంతో..
మా అమ్మకు 2 వేల నోట్ల ఉపసంహరణ గురించి సరైన అవగాహన లేదు. వారం కిందట
రూ.2 వేలు నోట్లు ఆరింటిని నాకు ఇచ్చింది. బ్యాంకుల్లో ఎక్స్ చేంజ్‌కు గడువు ముగియడంతో ఆర్బీఐ ఆఫీసులో మార్చుకునేందుకు వచ్చా. క్యూ లైన్ ఎక్కువగా ఉండటంతో చాలా టైమ్ పడుతోంది.
వహీద్, ఘట్ కేసర్