బ్యాంకుకు వెళ్లకుండానే కేవైసీ అప్​డేట్​

బ్యాంకుకు వెళ్లకుండానే కేవైసీ అప్​డేట్​

న్యూఢిల్లీ: ఖాతాదారులు కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడానికి ఇకపై తమ బ్యాంకు శాఖలను సందర్శించాల్సిన అవసరం లేదని, సెల్ఫ్​ డిక్లరేషన్ ఇస్తే ​చాలని ఆర్‌బీఐ తెలిపింది. ఇప్పటికే అవసరమైన పత్రాలను ఇచ్చి ఉండి,  చిరునామాను మార్చుకోనివారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. కేవైసీ సమాచారంలో మార్పు లేకుంటే,  ఈ–మెయిల్- ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఏటీఎంలు లేదా ఏదైనా ఇతర డిజిటల్ ఛానెల్‌ల ద్వారా సెల్ఫ్ ​డిక్లరేషన్​ను సమర్పించవచ్చు. కేవైసీ అప్‌డేషన్ కోసం బ్యాంకులు బ్రాంచ్​కు రావాలని కోసం పట్టుబట్టరాదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.

సెంట్రల్ బ్యాంక్  దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. కేవైసీ సమాచారంలో కొత్త మార్పులు అవసరం లేదనుకుంటే సెల్ఫ్​ డిక్లరేషన్​ సరిపోతుందని తెలిపింది. ఇంటర్నెట్​ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్ , లెటర్​ ద్వారా కూడా సెల్ఫ్​ డిక్లరేషన్​ ఇవ్వవచ్చు. చిరునామాలో మార్పు మాత్రమే ఉన్నట్లయితే, కస్టమర్‌లు ఈ ఛానెల్స్​లో దేని ద్వారానైనా కొత్త దానిని అందించవచ్చు. రెండు నెలల్లోగా చిరునామాను బ్యాంక్​ మారుస్తుంది.  బ్యాంక్ రికార్డులలో అందుబాటులో ఉన్న కేవైసీ పత్రాలు చెల్లకపోతే మాత్రమే కొత్త కేవైసీ  అవసరం. ఇలాంటి వాళ్లు -- పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, ఎన్​ఆర్​ఈజీఏ జాబ్ కార్డ్ వంటివి అందజేసి కేవైసీ పనిని పూర్తి చేయవచ్చు. ఇదివరకు సమర్పించిన కేవైసీ డాక్యుమెంట్​చెల్లుబాటు గడువు ముగిసిన సందర్భాల్లో కూడా కొత్తవి ఇవ్వాలి. కొత్త కేవైసీ పనిని బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా లేదా వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్  ద్వారా రిమోట్‌గా చేయవచ్చు అని ఆర్​బీఐ పేర్కొంది.