ముంబై: దేశంలోని బ్యాంకుల బిజినెస్ మోడల్స్ సరిగానే ఉన్నాయా లేదా అనే దానిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోతుగా పరిశీలిస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. బ్యాంకుల వ్యూహాలు తగినట్లుగా లేకపోతే క్రైసిస్‌కు దారితీసే ప్రమాదం ఉందన్నారు. బిజినెస్ మోడల్స్ సరిగా లేకపోవడం వల్లే సిలికాన్ వ్యాలీ బ్యాంకుతో పాటు మరికొన్ని బ్యాంకులు అమెరికాలో కుప్పకూలుతున్నాయని శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. ఈ క్రైసిస్ ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తంపై ఎఫెక్ట్ చూపకుండా ఆపడానికి కష్టాలు పడాల్సి వస్తోందని అన్నారు. మన దేశంలోని బ్యాంకులు పటిష్టంగానే ఉన్నాయని, ఇతర దేశాలలోని క్రైసిస్ ప్రభావం మన బ్యాంకులపై పడలేదని పేర్కొన్నారు. మన బ్యాంకులతో పాటు, ఆర్బీఐ తీసుకున్న చొరవే ఇందుకు కారణమని దాస్ చెప్పారు. అమెరికాలోని కొన్ని బ్యాంకులు కుప్పకూలడంతో వాటి బిజినెస్ మోడల్స్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
ఇక్కడి బ్యాంకుల బిజినెస్ మోడల్స్‌పై కన్నేశాం....
ఈ నేపథ్యంలో దేశంలోని బ్యాంకుల బిజినెస్ మోడల్స్‌ను నిశితంగా గమనిస్తున్నామని, ఏవైనా లోపాలుంటే క్రైసిస్‌కు దారి తీసే ప్రమాదం పొంచి ఉందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ఆర్బీఐకి అనుబంధంగా ఏర్పాటైన కాలేజ్ ఆఫ్ సూపర్వయిజర్స్ నిర్వహించిన ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో శక్తికాంత దాస్ మాట్లాడారు. బిజినెస్ మోడల్స్ కొన్నిసార్లు బ్యాంకుల బాలెన్స్ షీట్లలో రిస్క్‌లకు కారణం కావచ్చని ఆయన చెప్పారు. ఇలాంటివి సరయిన సమయంలో గుర్తించకపోతే పెద్ద క్రైసిస్‌లు ఎదుర్కోవల్సి వస్తుందన్నారు. ఒకప్పుడు సేఫ్‌గా అంచనా వేసిన అంశాలే ఆ తర్వాత బ్యాంకుల బాలెన్స్ షీట్లలో సమస్యలుగా మారడం వల్లే ఇటీవల అమెరికా, యూరప్‌లలోని కొన్ని బ్యాంకులు ఇబ్బందులపాలయ్యాయని అభిప్రాయపడ్డారు. ఎసెట్, లయబిలిటీల మధ్య బాలెన్స్‌ను సరి చూసుకోకపోవడం వల్లే సిలికాన్ వ్యాలీ బ్యాంకు కుప్పకూలిందని ఎనలిస్టులు చెబుతుండటాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఫైనాన్షియల్ రిస్కులను ఎప్పటికప్పుడు బ్యాంకుల మేనేజ్మెంట్లు, బోర్డులు పట్టించుకుంటూ ఉండాలని, అవసరమైతే తగినంత క్యాపిటల్, లిక్విడిటీ నిల్వలను ఏర్పాటు చేసుకునే దిశలో చర్యలు తీసుకోవాలని దాస్ సూచించారు. పటిష్టత అనేది వాటి బిజినెస్ మోడల్స్, వ్యూహాలతో లింక్ అయి ఉంటుందని చెప్పారు. క్యాపిటల్, లిక్విడిటీ నిల్వల విషయంలో పాటించాల్సిన నిబంధనలను, మార్కెట్లో క్యాపిటల్ సులభంగా దొరికే టైములో సమీకరించి నిల్వ చేసుకోవాల్సిందిగానూ బ్యాంకులకు ఆర్బీఐ సూచించిందని దాస్ తెలిపారు.
మన బ్యాంకులు భేష్....
దేశంలోని బ్యాంకులు ఎన్పీఏలు తగ్గించు కోవడంతోపాటు, తగిన క్యాపిటల్ నిల్వలనూ ఏర్పాటు చేసుకున్నాయని శక్తికాంత దాస్ వివరించారు. డిసెంబర్ 2022 నాటికి బ్యాంకుల గ్రాస్ఎన్పీఏలు 4.41 శాతానికి తగ్గాయని, అంతకు ముందు మార్చి 2022 నాటికి ఇవి 5.8 శాతంగా ఉన్నాయని వెల్లడించారు. మార్చి 2021 చివరినాటికి దేశంలోని బ్యాంకుల గ్రాస్ ఎన్పీఏలు 7.3 శాతమని చెప్పారు. డిసెంబర్ 2022 నాటికి మన బ్యాంకుల క్యాపిటల్ యాడిక్వసీ రేషియో 16.1 శాతమని, ఇది నిబంధనల ప్రకారం ఉండవల్సిన దానికంటే ఎక్కువేనని వెల్లడించారు. ఒత్తిడి ఎక్కువైన సమయంలోనూ తట్టుకునే సామర్ధ్యం షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు ఉందని దాస్ చెప్పారు. వేగంగా గ్రోత్ సాధించాలని కోరుకోవడం లేదా ఆలోచనా రహితంగా లాభాల వెనక పరిగెత్తడం వంటివే బ్యాంకుల వైఫల్యాలకు దారి తీస్తాయని దాస్ ఈ సందర్భంగా తెలిపారు.