ఆర్​బీఐ పాలసీ బూస్ట్​: దూసుకెళ్లిన మార్కెట్లు

ఆర్​బీఐ పాలసీ బూస్ట్​: దూసుకెళ్లిన మార్కెట్లు

ముంబై: ఆర్​బీఐ మానిటరీ పాలసీ ప్రకటనతో కొన్ని పెద్ద బ్యాంకులకు ప్రయోజనం కలుగుతుందనే అంచనాలతో స్టాక్​ మార్కెట్లు శుక్రవారం సెషన్లో దూసుకెళ్లాయి. గత ఏడు రోజులుగా పడుతున్న మార్కెట్లకు మానిటరీ పాలసీ ప్రకటన కొత్త జోష్​ ఇచ్చింది. బ్యాంక్​ నిఫ్టీ ఏకంగా వెయ్యికిపైగా పాయింట్లు పెరగడం బాగా కలిసొచ్చింది. దీంతో సెన్సెక్స్​ 1,017 పాయింట్లు  పెరిగి 57,427 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 1,313 పాయింట్ల దాకా సెన్సెక్స్​ ఎగసింది.  అలాగే నిఫ్టీ 276 పాయింట్లు  జంప్​ చేసి 17,094 వద్ద క్లోజయింది.

సెన్సెక్స్​లో భారతి ఎయిర్​టెల్​ టాప్​ గెయినర్​గా నిలిచింది. ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, బజాజ్​ ఫైనాన్స్​, కోటక్​ మహీంద్రా బ్యాంక్​, టైటాన్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, టాటా స్టీల్​ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఏషియన్​ పెయింట్స్​, డాక్టర్​ రెడ్డీస్​, ఐటీసీ, టెక్​ మహీంద్రా, హిందుస్థాన్​ యూనిలివర్​ షేర్లు నష్టాలతో క్లోజయ్యాయి. యూఎస్​ ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం నాటి నుంచి అటు గ్లోబల్​ మార్కెట్లు, ఇటు మన దేశపు మార్కెట్లు పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్​బీఐ మానిటరీ పాలసీ ప్రకటన బుల్స్​కు కొత్త ఉత్తేజం కల్పించిందని ఎనలిస్టులు చెబుతున్నారు. మార్కెట్​ అంచనాలకు అనుగుణంగానే రెపో రేటు పెంపుదల ఉందని వారు పేర్కొన్నారు.