అగ్గువ వడ్డీకి హౌజింగ్ లోన్లు

అగ్గువ వడ్డీకి హౌజింగ్ లోన్లు

ఆర్‌‌బీఐ తాజాగా రెపోరేట్లను తగ్గించడం వల్ల హౌజింగ్‌‌ లోన్లపై వడ్డీభారం తగ్గుతుంది. ఉదాహరణకు రూ.30 లక్షల లోన్‌‌పై అక్టోబరులో నెలకు రూ.22,855 ఈఎంఐ కడితే, అది ఇప్పుడు రూ.19,959లకు తగ్గుతుంది. అంటే బారోవర్‌‌కు నెలకు రూ.2,896 మిగులుతుంది. ఆర్‌‌బీఐ రేట్లను తగ్గించినప్పటికీ, అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం బ్యాంకులు, హౌజింగ్‌‌ ఫైనాన్షియల్‌‌ కంపెనీలే!  కొన్ని బ్యాంకులు రెపోరేటు ప్రకారం వడ్డీరేట్లను వసూలు చేస్తుండగా, మరికొన్ని సొంత రేట్ల ప్రకారం వడ్డీ తీసుకుంటున్నాయి. పాత కస్టమర్లకు కొన్ని బ్యాంకులు వడ్డీని తగ్గించవచ్చని, కొత్త వారికి తగ్గింపును ఇవ్వకపోవచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు.

న్యూఢిల్లీ: సొంతిల్లు లేదా ఫ్లాట్‌‌ కొనాలనుకుంటున్న వారికి తీపి కబురు. గతంతో పోలిస్తే బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్‌‌ ఇన్‌‌స్టిట్యూషన్లు ఇప్పుడు అతి చవగ్గా హౌజింగ్‌‌ లోన్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్‌‌బీఐ నిర్ణయం వల్ల వడ్డీరేట్లు ఎన్నడూ లేనంతగా తగ్గాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఏకంగా 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఆర్‌‌బీఐ తాజాగా శుక్రవారం రెపోరేట్లను మరోసారి 40 బేసిస్‌‌ పాయింట్ల వరకు తగ్గించడమే ఇందుకు కారణం. 100 బేసిస్‌‌ పాయింట్లు ఒక పర్సెంటేజ్‌‌ పాయింట్‌‌కు సమానం. ఈ నిర్ణయం వల్ల బ్యాంకులకు ఆర్‌‌బీఐ నుంచి మరింత తక్కువ వడ్డీకి అప్పులు వస్తాయి. ఫలితంగా అవి హౌజింగ్‌‌ లోన్ల వడ్డీలను ఇంకా తగ్గించగలుగుతాయి. కొత్త రేట్ల ప్రకారం ప్రస్తుతం ఈ కేటగిరీ వడ్డీ కేవలం ఏడు శాతమే ఉంటుంది. గత 15 ఏళ్లలో ఇంత తక్కువ వడ్డీ ఎప్పుడూ లేదని రియల్‌‌ ఎస్టేట్‌‌ సెక్టార్‌‌ ఎక్స్‌‌పర్ట్‌‌లు చెబుతున్నారు. కరోనా లాక్‌‌డౌన్‌‌ వల్ల దాదాపు చాలా మంది ఆదాయాలు తగ్గిన విషయం తెలిసిందే. మరికొందరు ఉద్యోగాలకు దూరమయ్యారు. దీంతో హౌజింగ్‌‌ లోన్ల ఈఎంఐలు కట్టలేక మూడు నెలల మారటోరియానికి దరఖాస్తు చేసుకున్నారు.

కస్టమర్లకు ఎంతో లాభం…

గత ఏడాది అక్టోబరు నుంచి హౌజింగ్‌‌ లోన్ల వడ్డీరేట్లను రెపోరేటుకు లింక్ చేయడం మొదలయింది. దీంతో వడ్డీ 1.4 పర్సంటేజ్‌‌ పాయింట్లు తగ్గింది. ఉదాహరణకు రూ.30 లక్షల లోన్‌‌పై అక్టోబరులో నెలకు రూ.22,855 ఈఎంఐ కడితే, అది ఇప్పుడు రూ.19,959లకు తగ్గుతుంది. అంటే బారోవర్‌‌కు నెలకు రూ.2,896 మిగులుతుంది. అయితే రెపోరేట్ల ప్రకారం వడ్డీరేట్లను వసూలు చేయని బ్యాంకులు, హౌజింగ్‌‌ ఫైనాన్స్‌‌ కంపెనీల కస్టమర్లకు వడ్డీరేట్లు తగ్గకపోవచ్చు.

వడ్డీరేట్ల తగ్గుదల ఇలా

రూ.30 లక్షల హౌజింగ్‌‌ లోన్‌‌కు 7.4 శాతం చొప్పున వడ్డీ అనుకుంటే 15 ఏళ్లకు చెల్లించాల్సిన వడ్డీ దాదాపు రూ.మూడు లక్షల వరకు అవుతుంది. కొత్త రేట్ల వల్ల ఈఎంఐ భారం నెలకు కనీసం రూ.రెండు వేలు తగ్గుతుంది. ఉదాహరణకు 15 ఏళ్లపాటు చెల్లించే రూ.30 లక్షల  లోన్‌‌కు ప్రస్తుతం స్టేట్‌‌ బ్యాంక్‌‌ 7.4 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. కొత్త రెపోరేటు  ప్రకారం వడ్డీ వసూలు చేస్తే ఇది ఏడు శాతానికి తగ్గుతుంది. రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు ఉన్న హౌజింగ్‌‌ లోన్లపై 7.65 శాతం వడ్డీ తీసుకుంటుండగా, ఇక నుంచి ఇది 7.25 శాతానికి తగ్గుతుంది.   రూ.75 లక్షలపైబడిన హౌజింగ్‌‌ లోన్‌‌కు 7.75 శాతం వడ్డీ తీసుకుంటుండగా, ఇక నుంచి ఇది 7.35 శాతానికి తగ్గుతుంది.  మహిళలకు  అయితే వడ్డీ మరో ఐదు బేసిస్‌‌ పాయింట్లు తగ్గుతుంది.

బ్యాంకులు దయతలిస్తేనే

ఎస్‌‌బీఐ వంటి కొన్ని బ్యాంకులు ఈ నెల ఎనిమిది నుంచి హౌజింగ్‌‌ లోన్లపై వడ్డీని కొత్త కస్టమర్లకు 20 బేసిస్‌‌ పాయింట్ల వరకు పెంచాయి. దీనివల్ల రెపోరేటు కంటే ఎక్కువ వడ్డీని చెల్లించాలి. లాక్‌‌డౌన్‌‌ వల్ల ఎగవేతలు పెరుగుతాయి కాబట్టే ఈ నిర్ణయానికి రావాల్సి వచ్చిందని స్టేట్‌‌బ్యాంక్‌‌ తెలియజేసింది. రెపోరేటు మార్పుల వల్ల అప్పుల ఖర్చు (ఫండ్స్‌‌ కాస్ట్‌‌) తగ్గుందనేది నిజం కాదని కొన్ని బ్యాంకులు వాదిస్తున్నాయి. పాత కస్టమర్లకు మాత్రమే కొంత ప్రయోజనం కలిగించవచ్చని అంటున్నాయి. అన్ని బ్యాంకులూ వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని సీనియర్‌‌ బ్యాంకర్‌‌ ఒకరు అన్నారు.

లాక్ డౌన్ తో 60 శాతం కుటుంబాల ఇన్ కమ్ లు డౌన్