IPL 2025: ఆర్సీబీకి భారీ గుడ్ న్యూస్.. ఎస్ఆర్‎హెచ్‎తో మ్యాచ్‎కు కెప్టెన్ పాటిదార్ ఫిట్

IPL 2025: ఆర్సీబీకి భారీ గుడ్ న్యూస్.. ఎస్ఆర్‎హెచ్‎తో మ్యాచ్‎కు కెప్టెన్ పాటిదార్ ఫిట్

బెంగుళూర్: ఐపీఎల్ 18లో భాగంగా శుక్రవారం (మే 23) మరో రసవత్తర పోరు జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ముఖాముఖీ తలపడనున్నాయి. దాదాపు ఇప్పటికే ఫ్లే ఆఫ్స్‎కు చేరుకున్న ఆర్సీబీ.. హైదరాబాద్‏పై గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‎కి దూసుకెళ్లడమే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇప్పటికే ఫ్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన హైదరాబాద్.. బెంగుళూరుపై గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. 

ఈ కీలక పోరుకు ముందు ఆర్సీబీ జట్టుకు ఒక భారీ గుడ్ న్యూస్ అందింది. గాయంతో బాధపడుతోన్న ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ ఫిట్ అయ్యాడు. ఎస్ఆర్‎హెచ్‎తో జరిగే మ్యాచులో బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ వెల్లడించారు. కెప్టెన్ రజత్ పాటిదార్ తన వేలి గాయం నుండి కోలుకున్నాడని, సన్‌రైజర్స్ హైదరాబాద్‌‎తో జరిగే మ్యాచ్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడని ఆయన తెలిపారు. బ్యాటింగ్ చేసేందుకు పాటిదార్ పూర్తి ఫిట్‎గా ఉన్నాడని చెప్పారు. 

2025 మే 3న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా పాటిదార్ వేలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు మిగిలిన మ్యాచులు ఆడటం అనుమానమేనని వార్తలు వినిపించాయి. ఇదే సమయంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 18 నిరవధిక వాయిదా పడింది. దాదాపు 15 రోజుల  పాటు ఐపీఎల్ నిలిచిపోయింది. ఇది పాటిదార్‎కు కలిసి వచ్చింది. ఐపీఎల్ వాయిదా పడటంతో పాటిదార్ గాయం నుంచి కోలుకున్నాడు. 

నో ప్రాబ్లం..!

ఆర్సీబీ దాదాపు 20 రోజులుగా మ్యాచ్ ఆడలేదని.. అయినప్పటికీ ఈ సుదీర్ఘ విరామం బెంగుళూరు జోరుపై ఎలాంటి ప్రభావం చూపించదన్నారు ఆంఢీ ఫ్లవర్. ఈ బ్రేక్ ఆటగాళ్ల మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడిందని ఆయన పేర్కొన్నారు. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, ఎస్ఆర్‎హెచ్ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. బెంగుళూరులో ప్రతికూల వాతావరణం కారణం వేదిక మారింది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరగనుంది. అయితే.. హోం గ్రౌండ్‎లో మ్యాచ్ ఆడకపోకపోవడం కొంత నిరాశే. కానీ ఆ ప్రభావం జట్టుపై చూపించదు. ఎందుకంటే లీగ్ మొదట్లో మేం గెలిచిన ఆరు మ్యాచులు ప్రత్యర్థి వేదికల్లోనే అని గుర్తు చేశారు ఆంఢీ ఫ్లవర్.