నవీ ముంబై: విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించింది. బ్యాట్‌తో మెరిసిన స్పిన్నర్ రాధా యాదవ్ (47 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 66) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌కు తోడు శ్రేయాంక పాటిల్ ( 5/23) ఐదు వికెట్లతో విజృంభించడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 32 రన్స్ తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 182/7 భారీ స్కోరు చేసింది. రాధతో పాటు రిచా ఘోష్ (28 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 44), నడిన్ డిక్లెర్క్ (12 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26) మెరుపుల మెరిపించారు. ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయి 43/4తో పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును రాధా, రిచా ఐదో వికెట్‌కు 105 రన్స్ భారీ పార్ట్‌నర్‌షిప్‌తో ఆదుకున్నారు.
గుజరాత్ బౌలర్లలో సోఫీ డివైన్ మూడు, కశ్వీ గౌతమ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌లో గుజరాత్ 18.5 ఓవర్లలో 150 రన్స్‌కే ఆలౌటైంది. భారతి ఫుల్మాలీ (39), బెత్ మూనీ (27) పోరాడారు. లారెన్ బెల్ మూడు వికెట్లు తీసింది. రాధా యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, గురువారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి లీగ్‌లో విజయాల ఖాతా తెరిచింది.
రాధా–రిచా ధమాకా
తొలుత ఆర్సీబీకి ఓపెనర్ గ్రేస్ హారిస్ (17) మెరుపు ఆరంభం అందించింది. పేసర్ రేణుక సింగ్ వేసిన తొలి ఓవర్లోనే నాలుగు బౌండ్రీలు కొట్టగా 23 రన్స్ లభించాయి. కానీ, మరో పేసర్ కశ్వీ గౌతమ్ ఆమెను పర్ఫెక్ట్ ఇన్‌స్వింగర్‌తో ఎల్బీ చేసి గుజరాత్‌కు తొలి బ్రేక్ ఇచ్చింది. తన తర్వాతి ఓవర్లో డి. హేమలత (4)ను కూడా ఔట్ చేసిన కశ్వీ ఆర్సీబీకి మరో షాక్ ఇవ్వగా.. తొలి ఓవర్ నిరాశ నుంచి వెంటనే తేరుకున్న రేణుక ఐదో ఓవర్లో కెప్టెన్ స్మృతి మంధాన (5) వికెట్ పడగొట్టింది.
స్మృతి ఇచ్చిన క్యాచ్‌ను రాజేశ్వరి గైక్వాడ్ ముందుకు డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకుంది. సోఫీ డివైన్ బౌలింగ్‌లో గౌతమి (9) కూడా వెనుదిరగడంతో ఆర్సీబీ స్కోరు వంద దాటితే గొప్పే అనిపించింది. కానీ, పవర్ ప్లే తర్వాత రాధా యాదవ్, రిచా అనూహ్యంగా విజృంభించారు. లెగ్ స్పిన్నర్ జార్జియా వారెహమ్ బౌలింగ్‌లో 4,6తో రాధ ఇన్నింగ్స్‌కు మళ్లీ ఊపు తెచ్చింది. తను దూకుడుగా ఆడగా.. రిచా కూడా క్రమం తప్పకుండా బౌండ్రీలు కొట్టడంతో ఆర్సీబీ స్కోరుబోర్డు వేగం పెరిగింది.
13వ ఓవర్లో ఇచ్చిన క్యాచ్‌ను కశ్వీ గౌతమ్ డ్రాప్ చేయడంతో రిచాకు లైఫ్ లభించింది. దీన్ని తను పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. సోఫీ డివైన్ బౌలింగ్‌లో ఘోశ్, రాధ చెరో సిక్స్‌తో స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో రాధ లీగ్‌లో తొలి ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 17వ ఓవర్లో రిచా ఔటైనా.. చివర్లో రాధాకు తోడైన నడిన్ డిక్లెర్క్ మెరుపు బ్యాటింగ్‌తో ఆర్సీబీ స్కోరు 180 మార్కు దాటింది.
పాటిల్ పాంచ్ పటాకా
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో గుజరాత్‌కు ఓపెనర్ బెత్ మూనీ మంచి ఆరంభమే ఇచ్చింది. మరో ఓపెనర్ సోఫీ డివైన్ (8) తడబడినా తొలి వికెట్‌కు 34 రన్స్ జోడించింది. డివైన్‌ను రిటర్న్ క్యాచ్‌తో అరుంధతి ఔట్ చేయగా.. వెంటనే మూనీని స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ పెవిలియన్ చేర్చింది. కెప్టెన్ ఆష్లే గార్డ్‌నర్ (3)ను లారెన్ బెల్ ఏడో ఓవర్లో ఔట్ చేయడంతో గుజరాత్ జోరుకు బ్రేకులు పడ్డాయి.
కాసేపు పోరాడిన కనిక (16)ను శ్రేయాంక, వారెహమ్ (13)ను డిక్లెర్క్ పెవిలియన్ చేర్చడంతో ఆ టీమ్ 70 రన్స్‌కే సగం వికెట్లు కోల్పోయింది. కానీ, ఈ దశలో భారతి ఫుల్మాలీ అనూహ్యంగా విజృంభించింది. కశ్వీ గౌతమ్ (18)తోడుగా భారీ షాట్లు కొట్టింది. అరుంధతి వేసిన 13వ ఓవర్లో 4, 6.. లారెన్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, డిక్లెర్క్ ఓవర్లో 6,4తో గుజరాత్‌ను రేసులోకి తెచ్చింది.
రెండు క్యాచ్ డ్రాప్‌లతో బతికిపోయిన కశ్వీని 16వ ఓవర్లో శ్రేయాంక పెవిలియన్ చేర్చడంతో ఆరో వికెట్‌కు 56 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. తర్వాతి ఓవర్లో ఫుల్మాలీని లారెన్ ఔట్ చేయడంతో ఆర్సీబీ తిరిగి మ్యాచ్‌లోకి వచ్చింది. 19 ఓవర్లో తనుజ కన్వార్ (21), రేణుక (2)ను పెవిలియన్ చేర్చిన శ్రేయాంక ఐదు వికెట్లు ఖాతాలో వేసుకోవడంతో పాటు ఆర్సీబీని గెలిపించింది.
సంక్షిప్త స్కోర్లు
ఆర్సీబీ: 20 ఓవర్లలో 182/7 (రాధా యాదవ్ 66, రిచా 44, సోఫీ డివైన్ 3/31).
గుజరాత్: 18.5 ఓవర్లలో 150 ఆలౌట్ (ఫుల్మాలీ 39, మూనీ 27, శ్రేయాంక 5/23, లారెన్ బెల్ 3/29)
