బెంగళూరు: చిన్నస్వామి స్టేడియమే చిన్నబోయేలా.. టిమ్ డేవిడ్ (25 బాల్స్‌లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 70 నాటౌట్), కెప్టెన్ రజత్ పాటిదార్ (19 బాల్స్‌లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 48 నాటౌట్) ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వేళ సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో విజయం అందుకుంది. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 43 రన్స్ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 250/3 స్కోరు చేసింది.
దేవదత్ పడిక్కల్ (29 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50) కూడా రాణించాడు. అనంతరం ఛేజింగ్‌లో సీఎస్కే 19.4 ఓవర్లలో 207 రన్స్‌కు ఆలౌటై వరుసగా మూడో ఓటమి ఖాతాలో వేసుకుంది. సర్ఫరాజ్ ఖాన్ (25 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 50), ప్రశాంత్ వీర్ (43), జేమీ ఓవర్టన్ (37) పోరాడినా ఫలితం లేకపోయింది. భువనేశ్వర్ మూడు, డఫీ, క్రునాల్ పాండ్యా, అభినందన్ చెరో రెండు వికెట్లు తీశారు. టిమ్ డేవిడ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ధనాధన్.. ఫటాఫట్
టాప్–5 బ్యాటర్లు సత్తాచాటడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. తొలి మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ రాకపోయినా.. మ్యాట్ హెన్రీ వేసిన నాలుగో ఓవర్లో 6, 4 కొట్టిన విరాట్ కోహ్లీ (28) వెంటనే అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయినా మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (46).. దేవదత్ పడిక్కల్ తోడుగా ఒక్కసారిగా జోరు పెంచాడు. అన్షుల్ ఓవర్లోనే 6, 4 .. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన సాల్ట్ శివం దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు.
కెప్టెన్ రజత్ పాటిదార్ రాకతో ఆర్సీబీ ఆట మరో లెవెల్‌కు వెళ్లింది. నూర్ అహ్మద్ వేసిన 12వ ఓవర్లో అతను రెండు భారీ సిక్సర్లు కొట్టాడు.. దూబే బౌలింగ్‌లో రజత్ సిక్స్ కొడితే.. పడిక్కల్ వరుసగా 6, 4, 4తో అలరించాడు. ఈ ఇద్దరి జోరుకు 13 ఓవర్లకే స్కోరు 150 దాటింది. తర్వాతి ఓవర్లో పడిక్కల్‌ను ఓవర్టన్ బౌల్డ్ చేయడంతో చెన్నై పుంజుకునేలా కనిపించింది.
కానీ, రజత్, టిమ్ డేవిడ్ ఆ చాన్స్ ఇవ్వలేదు. స్లాగ్ ఓవర్లలో భారీ షాట్లతో చెన్నై బౌలింగ్‌ను ఊచకోత కోశారు. ఖలీల్ వేసిన 16వ ఓవర్లో రజత్ 6, 4, 6 కొడితే.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో టిమ్ హ్యాట్రిక్ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆపై ఓవర్టన్ వేసిన 19వ ఓవర్లో వరుసగా 6, 2, 4, 6, 6, 6తో ఏకంగా 30 రన్స్ రాబట్టాడు. డేవిడ్, రజత్ ధాటికి చివరి 5 ఓవర్లలోనే ఆర్సీబీ 97 రన్స్ రాబట్టడం విశేషం.
చెన్నై పోరాడినా..
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో సీఎస్కేకు ఆదిలోనే వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ఐదో బాల్‌కు కెప్టెన్ రుతురాజ్ (7)ను జాకడ్ డఫీ, ఎనిమిదో బాల్‌కు ఆయుష్ మాత్రే (1)ను భువనేశ్వర్ పెవిలియన్ చేర్చాడు. స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ (9) మళ్లీ ఫెయిలయ్యాడు. డఫీ వేసిన మూడో ఓవర్లో పడిక్కల్‌కు క్యాచ్ ఇవ్వడంతో 30/3తో సీఎస్కే డీలా పడింది. ఈ టైమ్‌లో సర్ఫరాజ్ ఖాన్ భారీ షాట్లతో ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
డఫీ వేసిన ఐదో ఓవర్లో 6, 4,4 కొట్టిన అతను.. అభినందన్ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో 24 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. దాంతో పవర్ ప్లేను సీఎస్కే 77/3తో ముగించింది. అయితే, ఏడో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన స్పిన్నర్ క్రునాల్ పాండ్యా తన ఫస్ట్ బాల్‌కు సర్ఫరాజ్‌ను ఐదో బాల్‌కు ఇంపాక్ట్ ప్లేయర్ కార్తీక్ శర్మ (6)ను పెవిలియన్ చేర్చి చెన్నైని 84/5తో ఇబ్బందుల్లోకి నెట్టాడు.
కాసేపటికే శివం దూబే (18) కూడా వెనుదిరగడంతో 109/6తో నిలిచిన చెన్నై త్వరగానే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ ఈ టైమ్‌లో ప్రశాంత్ వీర్, జేమీ ఓవర్టన్ అనూహ్యంగా పోరాడారు. రొమారియో ఓవర్లో ఓవర్టన్ 6, 6, 4 కొడితే.. క్రునాల్ బౌలింగ్‌లో ప్రశాంత్ 4, 6, 4, 4తో రెచ్చిపోయాడు. కానీ, వరుస ఓవర్లలో ఈ ఇద్దరూ ఔటవడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 250/3 (టిమ్ డేవిడ్ 70 నాటౌట్, పడిక్కల్ 50, శివం దూబే 1/30)
చెన్నై: 19.4 ఓవర్లలో 207 ఆలౌట్ (సర్ఫరాజ్ 50, ప్రశాంత్ వీర్ 43, భువనేశ్వర్ 3/41)
