33 పార్టీల నేతలతో ప్రధాని మోడీ మీటింగ్

33 పార్టీల నేతలతో ప్రధాని మోడీ మీటింగ్
  • పార్లమెంటులో ఏ అంశంపై చర్చకైనా సిద్ధమేనని ప్రకటన

న్యూఢిల్లీ: ధరల పెరుగుదల, కరోనా సెకండ్‌ వేవ్‌ను కంట్రోల్ చేయడంలో కేంద్రం ఫెయిల్ అయిందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో  పార్లమెంటు సమావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చకు తమ ప్రభుత్వం సిద్ధమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సభలో నిర్మాణాత్మక, సానుకూల దృక్పథంతో డిబేట్ జరగాలని ఆయన అన్నారు. రూల్‌ ప్రకారం ఏ టాపిక్‌పై అయినా చర్చించే విషయంలో తాము వెనుకడుగేయబోమని చెప్పారు. సోమవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. కాగా, కేంద్ర మంత్రులు  అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్, ప్రహ్లాద్ జోషితో పాటు 33 పార్టీలకు చెందిన సభాపక్ష నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ తరఫున మల్లిఖార్జున ఖర్గే, అధిర్‌‌ రంజన్ చౌధరి, తృణమూల్‌ నుంచి డెరెక్ ఒబెరిన్, డీఎంకే నుంచి తిరుచి శివ, సమాజ్‌వాదీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నుంచి సతీశ్ మిశ్రా, అప్నా దళ్ నుంచి అనుప్రియా పటేల్, ఎల్జేపీ నుంచి పశుపతి పరాశ్ వంటి నేతలు పాల్గొన్నారు. సోమవారం నుంచి జరిగే ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 30 బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ సందర్భంగా ఎటువంటి అంశాలపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది.