శ్రీశైలం 4వ యూనిట్ రెడీ.. మూడు రోజులుగా మెషీన్ల టెస్టింగ్..సక్సెస్ అయితే గ్రిడ్కు అనుసంధానం

శ్రీశైలం 4వ యూనిట్ రెడీ..    మూడు రోజులుగా మెషీన్ల టెస్టింగ్..సక్సెస్ అయితే  గ్రిడ్కు అనుసంధానం

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌/నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌, వెలుగు: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌‌‌‌ కేంద్రంలోని నాలుగో యూనిట్‌‌‌‌ మరమ్మతు పనులు పూర్తయ్యాయి. గత మూడు రోజులుగా కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థ యూనిట్‌‌‌‌లోని అన్ని యంత్రాలను నడిపిస్తూ పరీక్షలు నిర్వహిస్తోంది. మరో 24 గంటలపాటు ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు విజయవంతమైతే యూనిట్‌‌‌‌ను జెన్‌‌‌‌కోకు అప్పగించి గ్రిడ్‌‌‌‌కు అనుసంధానించనున్నారు.

జీఐసీఏ నిధులతో రిపేర్లు..

2020లో ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌‌‌‌ కేంద్రంలో జరిగిన ప్రమాదం తర్వాత నాలుగో యూనిట్‌‌‌‌ దెబ్బతింది. 2021లో అప్పటి ప్రభుత్వం మరమ్మతులు ప్రారంభించినా కరోనా కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. 2024లో సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి 
విక్రమార్క కేంద్రాన్ని పరిశీలించి నాలుగో యూనిట్‌‌‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలపై అధికారులతో సమీక్షించారు. అదే ఏడాది వాయెట్‌‌‌‌ సంస్థకు మరమ్మతుల కాంట్రాక్ట్‌‌‌‌ అప్పగించి, జపాన్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ కోఆపరేషన్‌‌‌‌ ఏజెన్సీ(జీఐసీఏ) ద్వారా నిధులు సమకూర్చారు. యూనిట్‌‌‌‌ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత శాఖ మంత్రి ఆదేశించడంతో పనులు వేగంగా పూర్తయ్యాయి.

మూడు రోజులుగా టెస్టింగ్‌‌‌‌..

మరమ్మతులు పూర్తికావడంతో గత శనివారం నుంచి యూనిట్‌‌‌‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. టర్బైన్‌‌‌‌ హీటింగ్‌‌‌‌, వైబ్రేషన్‌‌‌‌, కరెంటు ఫ్రీక్వెన్సీ అంశాలను పరిశీలిస్తున్నారు. మరో 24 గంటలపాటు పరీక్షలు కొనసాగనున్నాయి. ఎలాంటి సమస్యలు తలెత్తకపోతే యూనిట్‌‌‌‌ను జెన్‌‌‌‌కోకు అప్పగించి, విద్యుత్‌‌‌‌ను గ్రిడ్‌‌‌‌కు అనుసంధానిస్తామని ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌‌‌‌ కేంద్రం ఎస్‌‌‌‌ఈ ఆదినారాయణ తెలిపారు. జెన్‌‌‌‌కో డైరెక్టర్‌‌‌‌ బాలరాజు యూనిట్‌‌‌‌ వద్దే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు.

ఆరేండ్ల తర్వాత..

2020 ఆగస్టు 20న అర్ధరాత్రి ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌‌‌‌ కేంద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపంతో డీసీ, ఏసీ విద్యుత్‌‌‌‌ సరఫరా ఏకకాలంలో జరగడంతో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో నాలుగో యూనిట్‌‌‌‌ పూర్తిగా దెబ్బతినడంతోపాటు టర్బైన్‌‌‌‌లు ధ్వంసమయ్యాయి. ఘటన సమయంలో యూనిట్‌‌‌‌ వద్ద ఉన్న 17 మంది సిబ్బందిలో తొమ్మిది మంది మృతిచెందారు. అప్పటి నుంచి నిలిచిపోయిన నాలుగో యూనిట్‌‌‌‌ ఇప్పుడు పునరుద్ధరణకు సిద్ధమైంది.