గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లాలో మహిళా సంఘాల్లోని నిరక్షరాస్యులైన వయోజన మహిళలను అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టిన అమ్మకు అక్షరమాల, ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ అన్ ఇన్ సొసైటీ) కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రత్యేక పరీక్ష నిర్వహించారు.
ఎప్పుడూ ఇంటి పనులతో బిజీగా ఉండే మహిళలు లేటు వయసులోనూ ఉత్సాహంగా పెన్ను పట్టి పరీక్ష రాశారు. జిల్లాలో గుర్తించిన 803 మంది నిరక్షరాస్య మహిళా సంఘ సభ్యుల్లో 751 మంది జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 కేంద్రాల్లో ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మూడో తరగతి అర్హత సాధించడంతో పాటు, భవిష్యత్లో ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంటుందని కోఆర్డినేటర్లు వెంకటేశ్వర్లు, మెప్మా సిబ్బంది వెంకటేశ్వర్లు, తిమ్మప్ప, మహాలక్ష్మి తెలిపారు.
వనపర్తి : వనపర్తి జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమంలో 268 గ్రామ పంచాయితీల పరిధిలో 17,506 మంది వయోజనులైన నిరక్షరాస్యులు పరీక్ష రాశారు. డీఆర్ఆర్ఓ, వయోజన విద్యాశాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. వయోజనులైన నిరక్షరాస్యులకు ఈ పరీక్ష వల్ల అక్షరాస్యులుగా మారి జీవన నైపుణ్యాలు సంపాదించుకుంటారని విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసరు ప్రతాపరెడ్డి తెలిపారు.
