కాంగ్రెస్తో కలిసి పనిచేస్తం.. త్వరలోనే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా : షర్మిల

కాంగ్రెస్తో కలిసి పనిచేస్తం..  త్వరలోనే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా :  షర్మిల

YSR తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు ఆపార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. AICC నేతలను కలిసేందుకు రేపు ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు. త్వరలోనే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు. తెలంగాణలో BRS ప్రభుత్వాన్ని ఓడించేందుకు కృషి చేశామన్నారు. ఈ కృషిని కాంగ్రెస్ గుర్తించిందన్నారు.   

కాంగ్రెస్‌పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్‌ పార్టీ అని చెప్పిన షర్మిల..   ప్రజలందరికీ భద్రత, భరోసా కల్పించే పార్టీ. అందుకే కాంగ్రెస్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.   కుటుంబ సమేతంగా ఇడుపుల పాయ YSR ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ మొదటి పత్రికను YSR ఘాట్ దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు షర్మిల కుటుంబ సభ్యులు. 

అంతకు ముందు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు వైఎస్ షర్మిల. YSR తెలంగాణ పార్టీని.. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లు పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన పదవులు, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించారు వైఎస్ షర్మిల. తెలంగాణ ఎన్నికల సమయంలోనే  YSRTP విలీనం ప్రక్రియ మొదలైనప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో విలీనం ప్రక్రియ ముగించాలని కాంగ్రెస్ భావిస్తోంది.