ప్రతి మూడు నెలలకో వ్యాక్సిన్.. వచ్చే ఏడాది ఆఖరుకు 100 కోట్ల డోసులు

ప్రతి మూడు నెలలకో వ్యాక్సిన్.. వచ్చే ఏడాది ఆఖరుకు 100 కోట్ల డోసులు

సీరం ఇన్‌‌స్టిట్యూట్ సీఈవో పూనమ్‌‌వల్లా
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ రూపొందించడంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు బిజీగా ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సైంటిస్టులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇండియాలో భారత్ బయోటెక్, సీరం ఇన్‌‌స్టిట్యూట్, జైడస్ కాడిలా, పెనాకీ బయోటెక్, ఇండియన్ ఇమ్యునాలజికల్స్ లాంటి పలు సంస్థలు వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీ గురించి సీరం ఇన్‌‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనమ్‌‌వల్లా పలు విషయాలు చెప్పారు. 2020-2021 ఆఖరుకు సీరం ఇన్‌‌స్టిట్యూట్ 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేస్తుందని పూనమ్‌‌వల్లా చెప్పారు. వచ్చే ఏడాది ఆరంభంలో కొవిషీల్డ్‌‌ను, ఆ తర్వాత ప్రతి త్రైమాసికానికి ఒకటి చొప్పున పలు వ్యాక్సిన్‌‌లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 

కొవిషీల్డ్, కొవోవ్యాక్స్, కొవివ్యాక్స్, కొవివ్యాక్, ఎస్ఐఐ కోవ్యాక్స్ పేర్లతో పలు రకాల కరోనా వ్యాక్సిన్‌‌లను సంసిద్ధం చేయడంపై సీరం ఇన్‌స్టిట్యూట్ పని చేస్తోందని పూనమ్‌‌వల్లా పేర్కొన్నారు. ఇప్పటికే 20-30 మిలియన్ వ్యాక్సిన్ డోసులను తమ సంస్థ తయారు చేస్తోందన్నారు. ప్రతి నెలా మరో 70 నుంచి 80 మిలియన్ డోసులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం తమ సొంతమన్నారు. డిమాండ్‌‌, అవసరాన్ని బట్టి వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా వ్యాక్సిన్‌‌ను రూపొందించడానికి ఆంగ్లో స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో కలసి సీరం ఇన్‌‌స్టిట్యూట్ పని చేస్తోంది.