- వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 71 శాతం ఫారిన్ ఇన్వెస్టర్లదే
- ఎకానమీ వృద్ధి చెందుతుండడంతో రియల్ ఎస్టేట్ సెక్టార్ వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు
- వెస్టియన్ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ సెక్టార్ ఇన్వెస్టర్లను భారీగా ఆకర్షిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్ (క్యూ1) లో డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 63.79 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. కిందటేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ. డిమాండ్ బాగుండడంతో భారీగా లాభాలొస్తాయని వీరు భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ వెస్టియన్ రిపోర్ట్ ప్రకారం, ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కూడా దేశ రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.
ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో డొమెస్టిక్, ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఏకంగా 310 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో పెట్టిన 160 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది 96 శాతం ఎక్కువ. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో ఇండియా రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో ఫారిన్ ఇన్వెస్టర్లు 222 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో వీరు 150 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టారు. డొమెస్టిక్ ఇన్వెస్టర్లు చేసిన పెట్టుబడులు 12.70 కోట్ల డాలర్ల నుంచి 63.79 కోట్ల డాలర్లకు పెరిగాయి.
ఫారిన్, డొమెస్టిక్ ఇన్వెస్టర్లు కలిసి చేసిన కో–-ఇన్వెస్ట్‌మెంట్స్ విలువ 55 లక్షల డాలర్ల నుంచి 26.02 కోట్ల డాలర్లకు ఎగిసింది. రియల్ ఎస్టేట్ సెక్టార్‌లోకి జూన్ క్వార్టర్‌లో వచ్చిన మొత్తం పెట్లుబడుల్లో 71 శాతం వాటా ఫారిన్ ఇన్వెస్టర్లదే ఉంది. డొమెస్టిక్ ఇన్వెస్టర్ల వాటా 20 శాతం ఉంది.ఇండియన్ రియల్ ఎస్టేట్ సెక్టార్ జూన్ క్వార్టర్‌లో పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్లను ఆకర్షించిందని వెస్టియన్ సీఈఓ శ్రీనివాస్ రావు అన్నారు.
ఫారిన్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారని చెప్పారు. గ్లోబల్ ఎకానమీ పరిస్థితి బాగోలేకపోవడంతో ఇండియా వైపు వీరు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లతో పాటు నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్లు కూడా రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో పెద్ద మొత్తంలో డబ్బులు పెడుతున్నారని వివరించారు. ఇండియా ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోందని, డిమాండ్ బాగుండడంతో రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలొస్తాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారని
పేర్కొన్నారు.
ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్ సెగ్మెంట్‌లోకి ఎక్కువ
ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో ఇండస్ట్రియల్ అండ్ వేర్‌హౌసింగ్ సెగ్మెంట్‌లో 150 కోట్ల డాలర్ల విలువైన అతిపెద్ద డీల్ ఒకటి జరిగిందని వెస్టియన్ రిపోర్ట్ వెల్లడించింది. జూన్ క్వార్టర్‌లో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఈ ఒక్క ఇన్వెస్ట్‌మెంట్ డీల్ వాటా48 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం పెట్టుబడుల్లో రెసిడెన్షియల్ సెగ్మెంట్‌లోకి 24 శాతం, కమర్షియల్ సెగ్మెంట్‌లోకి 20 శాతం వెళ్లాయి. కమర్షియల్ సెగ్మెంట్‌లోకి వచ్చిన ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్ట్‌మెంట్ల విలువ కిందటేడాది జూన్ క్వార్టర్‌లో 140 కోట్ల డాలర్లు ఉంటే, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో 62.23 కోట్ల డాలర్లకు తగ్గింది.
రెసిడెన్షియల్ సెగ్మెంట్‌లోకి వచ్చిన పెట్టుబడుల విలువ 57 లక్షల డాలర్ల నుంచి 73.28 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇండస్ట్రియల్ అండ్ వేర్‌హౌసింగ్ సెగ్మెంట్‌లోకి కిందటేడాది జూన్ క్వార్టర్‌లో 13.39 కోట్ల డాలర్లు రాగా, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో 150 కోట్ల డాలర్లు వచ్చాయి. రానున్న క్వార్టర్లలో రియల్ ఎస్టేట్ సెక్టార్‌లోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని వెస్టియన్ అంచనా వేస్తోంది.