ఇంకో పదేళ్లలో రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ సెక్టార్ రూ.124 లక్షల కోట్లకు

ఇంకో పదేళ్లలో రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ సెక్టార్ రూ.124 లక్షల కోట్లకు
  • జీడీపీలో 10.5 శాతానికి పెరుగుతుంది: సీఐఐ‑నైట్‌‌‌‌ ఫ్రాంక్ రిపోర్ట్‌‌‌‌

న్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌‌‌ 2034  నాటికి 1.5 లక్షల కోట్ల డాలర్ల (రూ.124 లక్షల కోట్ల) కు చేరుకుంటుందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), నైట్ ఫ్రాంక్‌‌‌‌ ఇండియా పేర్కొన్నాయి.  ‘ఇండియన్ రియల్ ఎస్టేట్‌‌‌‌: ఏ డకేడ్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ నౌ’ పేరుతో ఓ రిపోర్ట్‌‌‌‌ను విడుదల చేశాయి. ఇండియన్ ఎకానమీ మరింత పెరుగుతుందని, ఇందులో  రియల్‌‌‌‌ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌ పాత్ర కీలకంగా ఉంటుందని ఈ రిపోర్ట్‌‌‌‌ పేర్కొంది. వచ్చే పదేళ్లలో దేశ జీడీపీలో రియల్ ఎస్టేట్ సెక్టార్ వాటా 10.5 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.  

పట్టణాల్లో జనాభా పెరుగుతుండడంతో ఇండ్లకు డిమాండ్ దూసుకుపోతుందని పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రకారం, ఇండ్ల డిమాండ్ 2034 నాటికి 906 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. రానున్న  పదేళ్లలో పట్టణాల్లోని జనాభా కోసం 7.8 కోట్ల కొత్త ఇండ్లు అవసరమవుతాయి. అఫోర్డబుల్ ఇండ్ల నుంచి లగ్జరీ ఇండ్ల వరకు అన్ని సెగ్మెంట్లలో డిమాండ్ పెరుగుతుందని సీఐఐ– నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన రిపోర్ట్ పేర్కొంది.  రియల్ ఎస్టేట్ సెక్టార్ పాజిటివ్‌‌‌‌గా ఉందని  సీఐఐ నేషనల్ కమిటీ ఆన్ రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ చైర్మన్ నీల్ రహేజా అన్నారు. 

ఇన్వెస్టర్లకు ఈ సెక్టార్ బోలెడు అవకాశాలను అందిస్తోందని చెప్పారు. రానున్న పదేళ్లలో ఎకానమీ మరింత పెరుగుతుందని,  రియల్ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో రెవెన్యూ , వినియోగం పెరుగుతాయని అంచనా వేశారు.  కమర్షియల్ రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా రానున్న పదేళ్లలో దూసుకుపోతుందని సీఐఐ–నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడించింది.  2034 నాటికి 270 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అవసరం అవుతుందని అంచనా వేసింది. టైర్ 2, 3 సిటీలకు బిజినెస్‌‌‌‌లు విస్తరిస్తుండడం, ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌, ఐటీ, సర్వీసెస్ ఇండస్ట్రీస్‌‌‌‌ పెరగడం వంటి కారణాలతో ఆఫీస్ స్పేస్‌‌‌‌కు ఫుల్ డిమాండ్ క్రియేట్ అవుతుందని  తెలిపింది.