- నాన్ లే ఔట్, ఫామ్ ల్యాండ్ వెంచర్లలో మోసాలు
- సూరారంలోని నక్షత్ర వెంచర్ లో రోడ్ల భూమి తాకట్టు పెట్టి అప్పులు
- కస్టమర్లు ఆందోళన చేస్తున్నా జరగని న్యాయం
- జిల్లావ్యాప్తంగా చాలా వెంచర్లలో ఇదే తీరు
- నాన్ లేఔట్లపై అధికారుల చర్యలు శూన్యం
మంచిర్యాల, వెలుగు: నాన్ లేఔట్, ఫామ్ ల్యాండ్ వెంచర్లలో ప్లాట్లు కొన్నారా? అయితే రోడ్ల కోసం తీసిన జాగా ఉన్నదా? రియల్టర్లు అమ్మేసుకున్నారా..? ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే మోసపోతారు జాగ్రత్త. ఒకవేళ రియల్టర్లు రోడ్ల జాగలను అమ్మేసుకుంటే భవిష్యత్లో మీరు మీ ఫ్లాట్ల దగ్గరకు వెళ్లాలంటే దారి కూడా ఉండదు. ఇక ఇబ్బందులు తప్పవు. ఈ తరహా మోసాలు మంచిర్యాల జిల్లాలో చాలా జరుగుతున్నాయి.
'నక్షత్ర' చీటింగ్ ఇదీ..
లక్షెట్టిపేట మండలం సూరారం గ్రామ శివారులో మంచిర్యాలకు చెందిన నక్షత్ర రియల్ ఎస్టేట్ నిర్వాహకులు రెండేండ్ల క్రితం మూడెకరాల్లో నాన్ లేఔట్ వెంచర్ చేశారు. అందులో సుమారు 51 ఫ్లాట్లు తీసి గజం రూ.6 వేల నుంచి రూ.7 వేల చొప్పున కస్టమర్లకు అమ్మేశారు. అంతటితో ఆగకుండా 30 ఫీట్ల వెడల్పు రోడ్ల కోసం తీసిన జాగలను తాకట్టుపెట్టి ఆ సంస్థకు చెందిన ఒక పార్టనర్ రూ.లక్షల్లో అప్పులు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించకపోవడంతో డబ్బులు ఇచ్చిన వ్యక్తి రోడ్ల కోసం కేటాయించిన జాగకు కాంపౌండ్ వేసుకున్నాడు.
దీంతో కస్టమర్లు తమకు న్యాయం చేయాలంటూ ఇటీవల వెంచర్ వద్ద ఆందోళనకు దిగారు. సదరు రియల్టర్ స్పందించకపోవడంతో కాంపౌండ్ను తొలగించారు. అతడిపై లక్షెట్టిపేట పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దాదాపు రూ.15 లక్షలు పెట్టి ప్లాట్లు కొనుగోలు చేశామని తెలిపారు. ఇండ్లు కట్టుకుందామంటే రోడ్లు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాన్ లేఔట్, ఫామ్ వెంచర్లలో మోసాలు
జిల్లాలో నాన్ లేఔట్, ఫామ్ ల్యాండ్ వెంచర్లలో ఇలాంటి మోసాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. లే ఔట్ వెంచర్లలో 33 ఫీట్ల రోడ్లతో పాటు సామాజిక అవసరాల కోసం కేటాయించిన 10 శాతం స్థలాన్ని మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. దీంతో చాలామంది రియల్టర్లు నాన్ లే ఔట్, ఫామ్ ల్యాండ్ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో రోడ్ల కోసం తీసిన జాగలను వారి పేరిటే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ప్లాట్లు మొత్తం అమ్ముడుపోయిన తర్వాత రోడ్ల కోసం కేటాయించిన జాగలను సైతం అమ్ముకుంటున్నారు. జైపూర్ మండలంలోని ఫామ్ ల్యాండ్ వెంచర్లలో కూడా ఇలాంటి మోసాలు జరిగినట్టు సమాచారం.
పట్టించుకోని అధికారులు
నాన్ లేఔట్, ఫామ్ ల్యాండ్ వెంచర్ల పేరిట జరుగుతున్న మోసాలను సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వెంచర్లలో వ్యవసాయ భూముల పేరిట గుంట నుంచి ఐదు గుంటల వరకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అది ఇల్లీగల్ వెంచర్ అని తెలిసినప్పటికీ గతంలో ధరణి, ఇప్పుడు భూభారతిలోని లొసుగులను అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.
ఒకసారి స్లాట్ బుక్ అయితే ఆపే అధికారం తమకు లేదంటూ వారి తప్పులను ధరణి, భూభారతి పోర్టల్స్ పైకి నెట్టివేస్తున్నారు. లేఔట్ వెంచర్లలో ఎక్కువ రేట్లు పెట్టి ప్లాట్లు కొనే స్తోమత లేని వారు నాన్ లేఔట్, ఫామ్ ల్యాండ్ వెంచర్లలో పెట్టుబడులు పెట్టి నిలువునా మునుగుతున్నారు.

