ప్రజా ప్రతినిధులంటే వీళ్లే... కరోనా శవాలకు అన్నీ తామై అంత్యక్రియలు

ప్రజా ప్రతినిధులంటే వీళ్లే... కరోనా శవాలకు అన్నీ తామై అంత్యక్రియలు

కష్టకాలంలో ధైర్యంగా సామాజిక సేవ

జగిత్యాల జిల్లా: కరోనాతో చనిపోయిన వారిని చూసేందుకు కుటుంబ సభ్యులే దగ్గరికి రాలేని పరిస్థితి. కన్నకొడుకులు, బిడ్డలున్నా అనాథ శవాలుగా శ్మశానికి వెళ్లే పరిస్థితి. చాలాచోట్ల వైద్య సిబ్బందే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయితే జగిత్యాల జిల్లాలో ఇద్దరు ప్రజా ప్రతినిధులు, వారి టీమ్ సభ్యులు కరోనా వైరస్ తో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. రోజూ వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ.. పరిస్థితి విషమించి అనేకమంది చనిపోతున్నారు. వీరికి అంత్యక్రియలు జరపడం ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో... అయినవాళ్లున్నా అంత్యక్రియలకు నోచుకోని డేడ్ బాడీలకు అన్నీతామై వారి వారి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్విహిస్తున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు. 
కరోనా సోకినా.. ఆపకుండా కార్యక్రమాలు


జగిత్యాల జిల్లా కోరుట్ల 22 వ వార్డు బీజేపీ కౌన్సిలర్ మ్యాడవేని నరేష్... ఆయన బృందం  మరో పదిమంది కలిసి ఇప్పటి వరకు 55 కరోనా డెడ్ బాడీలకు వారివారి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరిపారు. పీపీఈ కిట్లు ధరించి హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసి శవాన్ని శ్మశాన వాటికలకు వాహనాల్లో తరలించడం, అంత్యక్రియలు జరపడం వరకు అన్నీ తామే చేస్తున్నారు. ఇప్పటికే నరేష్ కు ఓసారి కరోనా వచ్చింది. అయినా ఈ  కార్యక్రమాన్ని ఆపకుండా చేస్తూనే ఉన్నారు. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, జగిత్యాల, రాయికల్ తో పాటు... నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పెల్లి వరకూ కరోనాతో అంత్యక్రియలకు నోచుకోని  మృతదేహాలకు వీళ్లే వెళ్లి నిర్వహిస్తున్నారు. 

కరోనా మొదటి దశ నుండి ఇదే సేవ
కథలాపూర్ మండలం తాండ్ర్యాల సర్పంచ్ గంగాప్రసాద్.. ఆయన బృందం కూడా నరశ్ టీమ్ లాగే సేవలందిస్తున్నారు. కరోనా మొదటి వేవ్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు  20 
మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. కథలాపూర్ తో పాటు... కొడిమ్యాల, చందుర్తి, మల్యాల మండలాల్లో వైరస్ తో చినిపోయివారికి అన్నీ తామై అంత్యక్రియలు జరుపుతున్నారు. కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొన్న నేపధ్యంలో కరోనా వైరస్ తో చనిపోయినవారికి ధైర్యంగా అంత్యక్రియలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు ఈ ప్రజా ప్రతినిధులు, వారి టీమ్ సభ్యులు.