ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మంచిర్యాల, వెలుగు:  జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల ప్రభుత్వ భూములు రియల్​ వెంచర్లుగా మారుతున్నాయి. కొంతమంది రియల్టర్లు ఖాళీగా ఉన్న సర్కారు జాగలను, వాగులు, చెరువులను కబ్జా చేసి వెంచర్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాకేంద్రంలోని రాళ్లవాగు సమీపంలో మరో రియల్​ దందా వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల పట్టణం మధ్యలోంచి ప్రవహించే రాళ్లవాగు చాలా సంవత్సరాల కిందట దిశను మార్చుకుంది. ఈ కాలువ భూమి సర్వేనంబర్​ 140, 141 పక్కనున్న భూములను ఆక్రమణదారులు చదును చేసి ప్లాట్లుగా మార్చేందుకు ప్రయత్నించారు. ఈ విషయం కలెక్టర్​ భారతీ హోళికేరి దృష్టికి రావడంతో రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. అడిషనల్​ కలెక్టర్​ మధుసూదన్​ నాయక్​ శనివారం ప్రభుత్వ భూములను ఆర్డీవో, తహసీల్దార్​, ఇరిగేషన్​, మున్సిపల్​ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ట్రెంచ్​ కొట్టించి మొక్కలు నాటడంతో పాటు ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారు. రాళ్లవాగు సమీపంలోని సర్వే నంబర్లు 140, 141, పక్కనున్న భూములను ఎవరైనా పట్టా భూమిగా చూపించి అమ్మితే వారిపై క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరూ ఈ భూములను కొని మోసపోవద్దని సూచించారు.   

ఉత్సాహంగా ఫ్రెషర్స్ డే 

ఆదిలాబాద్​ గవర్నమెంట్ సైన్స్ డిగ్రీ కాలేజీలో శనివారం ఫ్రెషర్స్​డే నిర్వహించారు. స్టూడెంట్స్​ క్లాసికల్​ సాంగ్స్​పై స్టెప్పులేశారు. ప్రిన్సిపాల్ జగ్ రామ్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. 

- వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్

ధాన్యం అంతా కొంటాం

నిర్మల్,వెలుగు: జిల్లాలోని ధాన్యం అంతా కొంటామని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన బాటలో ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు. సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామంలో శనివారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రం, గాజులపేటలో నిర్మించిన  అంబేద్కర్ భవనాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు.  ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 192  ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. దళితుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్ రాంబాబు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, రైతు సమన్వయ సమితి జిల్లా  చైర్మన్​ నల్ల వెంకట రామిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు.

హెల్మెట్​ లేదంటూ వెహికల్​ ఆపి చోరీ

భైంసా,వెలుగు: హెల్మెట్​ఎందుకు పెట్టలేదు... బండి పేపర్లు ఏవీ? అంటూ  రూ. 2  లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన శనివారం భైంసా మండలం తిమ్మాపూర్​శివారులో జరిగింది. వివరాలు.. మండలంలోని కోతుల్ గావ్​ గ్రామానికి చెందిన భూమన్న ఇంటి నిర్మాణం కోసం వానల్ పాడ్​లో తెలంగాణ గ్రామీణ బ్యాంకులోని తన అకౌంట్​ నుంచి రూ. 2 లక్షలు విత్​డ్రా చేశారు.  ఆ తర్వాత తలుపులు ఎప్పుడు పెట్టుకోవాలో తెలుసుకునేందుకు లూనాపై కల్లూరు గ్రామంలోని పురోహితుడి వద్దకు వెళ్లాడు. తిరిగి కోతుల్​గావ్​కు వెళ్తుండగా తిమ్మాపూర్​ వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఎదురుగా వచ్చి హెల్మెట్లఆేదంటూ ఆపాడు. బండి పేపర్లు అన్ని ఉన్నాయా అంటూ అడిగాడు. డిక్కీలోని రూ. 2 లక్షలు, ఫోన్, లూనా తాళం తీసుకొని పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మూడున్నరేండ్లుగా నిలిచిన ఉత్పత్తి...  

మంచిర్యాల సిమెంట్​ కంపెనీ (ఎంసీసీ)లో 2019 జూలైలో సిమెంట్​ ఉత్పత్తిని నిలిపివేశారు. అందులో పనిచేస్తున్న కార్మికులను, ఉద్యోగులను దశలవారీగా తొలగించారు. వారికి రావాల్సిన వేతన బకాయిలు, పీఎఫ్​, ఇతర బెనిఫిట్స్​ కోసం లేబర్​ కమిషనర్​ కోర్టులో పోరాడుతున్నారు. కంపెనీ మూతపడి మూడున్నర సంవత్సరాలు కావస్తుండడంతో ప్లాంట్​లోని మిషనరీలు అన్నీ పాడుబడుతున్నాయి. ఇప్పటికే కొన్నింటిని స్క్రాప్​ చేసి అమ్ముతున్నట్టు సమాచారం. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఎంసీసీ ఇక తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. 1956లో అసోసియేటెడ్​ సిమెంట్​ కంపెనీ (ఏసీసీ)ని ఏర్పాటు చేశారు. 1958లో సిమెంట్​ ఉత్పత్తిని ప్రారంభించారు. రోజుకు వెయ్యి టన్నుల కెపాసిటీతో 2000 సంవత్సరం వరకు నిరంతరాయంగా నడిపించారు. 2006లో కొంతమంది ప్రమోటర్లకు కారుచౌకగా విక్రయించారు. కంపెనీని నడిపించడానికి అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ మూసివేయడంతో దానిపై ఆధారపడ్డ సుమారు వెయ్యి కార్మిక కుటుంబాలు రోడ్డునపడ్డాయి.  

జర్నలిస్టు కుటుంబానికి మంత్రి పరామర్శ

నిర్మల్,వెలుగు: నిర్మల్​పట్టణానికి చెందిన సీనియర్​ జర్నలిస్టు, వెలుగు దినపత్రిక సిటీ బ్యూరో ఇన్​చార్జి శశికాంత్ రెడ్డి తండ్రి నర్సారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. శనివారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పట్టణంలోని శాస్త్రి నగర్ లోని శశికాంత్​రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రగాడ సానుభూతి తెలిపారు.

కౌన్సిలర్​ భూమిని కబ్జా చేసిండు 

చెన్నూర్​, వెలుగు: చెన్నూర్​ మున్సిపాలిటీ పరిధిలోని 819 సర్వేనంబర్​లో గల 38 గుంటల అసైన్డ్​ భూమిని టీఆర్​ఎస్​ కౌన్సిలర్​ రెవెళ్లి మహేశ్​​ కబ్జా చేశాడని తగరం వెంకటేశ్​ ఆరోపించాడు. ఈ భూమిని తగరం గట్టయ్య, పోచమల్లు, గున్నయ్యలకు ప్రభుత్వం గతంలోనే అసైన్డ్ చేసిందని తెలిపాడు. ఆ భూమికి ఇప్పుడు అధిక రేటు ఉండడంతో 4వ వార్డ్ కౌన్సిలర్ మహేష్ కబ్జాచేశాడని వెంకటేశ్​ కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ భూమి నాదే మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటూ వారసులను బెదిరిస్తున్నాడని తెలిపారు. దీనికి నిరసనగా శనివారం స్థానిక అంబేద్కర్ చౌక్​లో మహేష్ దిష్టిబొమ్మ బాధితులు దహనం చేశారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ భూకబ్జాదారుడైన మహేశ్​​ను టీఆర్ఎస్​ నుంచి సస్పెండ్​ చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారికి మద్దతుగా బీఎస్పీ ఉమ్మడి జిల్లా మహిళా కన్వీనర్ భవాని పాల్గొన్నారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న అధికార పార్టీ లీడర్లకు వంతపాడుతున్నారని ఆమె మండిపడ్డారు.  

న్యాయ వ్యవస్థలపై అవగాహన పెంచుకోవాలి

ఆసిఫాబాద్,వెలుగు: న్యాయ వ్యవస్థపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.ఉమామహేశ్వరి సూచించారు. శనివారం ఆసిఫాబాద్ మండలం బురుగూడలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. వివిధ చట్టాలు.. న్యాయం పొందే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అడ్వొకేట్లు రాజీవ్​రెడ్డి, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఖైదీల్లో మార్పురావాలి..

క్షణిక ఆవేశంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని చీఫ్ జుడిషియల్​మేజిస్ట్రేట్, అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె. వెంకటేశ్ సూచించారు. శనివారం ఆసిఫాబాద్ సబ్- జైలును తనిఖీ చేశారు. ఖైదీలు అడ్వొకేట్లను పెట్టుకునే స్థోమత లేకపోతే మండల న్యాయ సేవా సమితి ద్వారా ఉచితంగా న్యాయ సహాయం  అందుతుందన్నారు. చట్టాలపై అవగాన లేకపోవడంతోనే నేరాలు పెరుగుతు న్నాయన్నారు. ప్రతీ ఒక్కరు మానసికంగా దృడంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో లాయర్లు  నరహరి, నగేశ్, జైలు సూపరింటెండెంట్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి..

బెల్లంపల్లి,వెలుగు: పెండింగ్​ కేసుల పరిష్కారానికి  అడ్వొకేట్లు, పోలీసు ఆఫీసర్లు కృషిచేయాలని బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి గొల్ల హిమబిందు కోరారు. ఈనెల 12 న మెగా లోక్ అదాలత్  నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం కోర్టు హాల్​లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కక్షిదారులు రాజీపడేలా చూడాలన్నారు. సమావేశంలో వన్ టౌన్, బెల్లంపల్లి రూరల్, తాండూర్ సీఐలు రాజు, బాబూరావు, జగదీశ్​తదితరులు పాల్గొన్నారు.

ట్రైబల్ గురుకులంలో...

ఇచ్చోడ,వెలుగు: ఇచ్చోడ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్​స్కూల్​లో శనివారం బోథ్​జూనియర్​సివిల్​జడ్జి హుస్సేన్​ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు చట్టాలు విద్యాహక్కు, బాలకార్మిక నిర్మూలన, బాల్య వివాహాలు, కోర్టు విధులపై అవగాహన కల్పించారు. అనంతరం స్కూల్ వంట గది, భోజ వసతులు, రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ పంద్రం శంకర్, అడ్వొకేట్లు రూపేందర్ సింగ్, దమ్మాపాల్, ప్రిన్సిపాల్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

బిల్లులు ఇవ్వాలంటూ సర్పంచుల నిరసన

ఖానాపూర్,వెలుగు: పంచాయతీలకు రావాల్సిన పెండింగ్​బిల్లులు వెంటనే రిలీజ్​చేయాలని డిమాండ్​చేస్తూ శనివారం పలు గ్రామాల సర్పంచులు ఎంపీపీ ఆఫీస్​ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు ఎంపీపీ మోహీద్​ అధ్యక్షతన జరిగిన మండల సమావేశాన్ని బహిష్కరించారు. నిధుల కొరత కారణంగా గ్రామాల్లో ఎలాంటి పనులు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్లకు డీజిల్​బిల్లు కట్టే పరిస్థితి లేదన్నారు. నిరసనలో సర్పంచులు శ్రీనివాస్, మహేందర్, రవీందర్, గోపాల్, రామ కృష్ణ, రాజేందర్ పా ల్గొన్నారు.

చేపలు పట్టనిస్తలేరని వాటర్​ ట్యాంక్ ఎక్కిండు

 జైపూర్(భీమారం)వెలుగు: చేపలు పట్టనిస్తలేరని భీమారం మండల కేంద్రానికి చెందిన సుంకరి దుర్గయ్య శనివారం వాటర్ ట్యాంక్ ఎక్కాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... గొల్లవాగు ప్రాజెక్టులో ప్రభుత్వం చేప పిల్లలు వదిలి ముదిరాజ్ కుటుంబాల జీవనోపాధి కోసం అప్పగించింది. ప్రాజెక్టులో చేపలు పట్టడానికి రెండు, మూడేళ్లకు ఒక్కసారి మత్స్యకార సంఘం సభ్యులు వేలం పాటను నిర్వహిస్తున్నారు. గత ఏడాది మార్చిలో వేలం పాట నిర్వహించగా దుర్గయ్య రూ. 56 లక్షలకు దక్కించుకున్నాడు. సంఘానికి రూ. 30 లక్షలు చెల్లించి, మరో రూ. 9 లక్షలు ప్రాజెక్టులోని చెట్లు తొలగించేందుకు ఖర్చుచేశాడు.  ఇప్పడు ప్రాజెక్టులో చేపలు పడితే ముదిరాజ్ ​కులస్తులు అడ్డుకుంటున్నారు. మళ్లీ వేలం పాట నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తనను మోసం చేసిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని బాధితుడు తెలిపాడు. జైపూర్ ఏసీపీ నరేందర్, శ్రీరాంపూర్ సీఐ రాజు ఫోన్లో మాట్లాడి  న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించాడు. 

తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్య తీసుకోవాలి

రామకృష్ణాపూర్,వెలుగు: క్యాతనపల్లిలోని స్వయం కృషి పాలమిత్ర  కోఆపరేటివ్​సొసైటీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్య తీసుకోవాలని సొసైటీ సభ్యులు శనివారం ఎస్సై అశోక్​కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్​ వీరమల్ల రాజయ్య, సభ్యులు మాట్లాడుతూ... క్యాతనపల్లిలో పాడి రైతులు సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి రోజూ సుమారు 300 లీటర్ల క్వాలిటీ పాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. కొందరు వ్యక్తులు పాలు కల్తీ చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో రైతుల ఉపాధికి నష్టం కలిగే అవకాశం ఉందన్నారు.

రైతును రాజు చేస్తాం

భైంసా,వెలుగు: రైతులను రాజు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చెప్పారు. శనివారం భైంసా మండలం ఎగ్గాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మొద్దన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కృష్ణ, పీఏసీఎస్ చైర్మన్​ దేవేందర్ రెడ్డి, మార్క్ ఫెడ్ డైరెక్టర్ గంగాచరణ్, సర్పంచ్ సంజీవ్ రెడ్డి, లీడర్లు గణేశ్, భీంరావు పటేల్, భూమారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాంకుమార్, సచిన్, తోట రాము, లస్మన్న పాల్గొన్నారు.

లే ఔట్లు లేని జాగల రిజిస్ట్రేషన్ ​చేయొద్దు

ఆదిలాబాద్​ టౌన్,వెలుగు: జిల్లా కేంద్రంలోని బట్టి సవర్గాం శివారులో లేఔట్లు లేకుండా అమ్ముతున్న జాగను రిజిస్ట్రేషన్​ చేయొద్దని బాధితులు షేక్​ అబ్రార్ అలీ, ఎస్​కే ముసావీర్​ కోరారు. శనివారం సబ్​ రిజిస్ట్రార్​ అశోక్​కు వినతి పత్రం అందజేశారు. బట్టి సవర్గాం శివారులోని 72/4, 72/4/1 సర్వే నంబర్​లో తాము రెండు ఎకరాలు కొనుగోలు చేశామని, తిరిగి ఆ స్థలాన్ని మహ్మద్ అబ్దుల్లాఖాన్ అక్రమంగా అమ్మేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపించారు. గతంలో మావల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ స్థలాన్ని ఎవరూ కొనకుండా చూడాలని వేడుకున్నారు.

ముగిసిన సివిల్స్ ​అధికారుల ఫౌండేషన్​ కోర్సు

ఆదిలాబాద్​టౌన్​,వెలుగు: జిల్లాలో ఐదు రోజులుగా సివిల్​సర్వీస్​ అధికారులకు నిర్వహించిన ఫౌండేషన్​కోర్సు శనివారం ముగిసింది. మావల మండలం వాఘాపూర్, తలమడుగు మండలం కజ్జర్ల, బేల మండలం అవాల్ పూర్​ గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలు, ప్రజల జీవన స్థితిగతులపై పరిశీలించారు. కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో 14  మంది సివిల్ సర్వీస్ అధికారులను కలెక్టర్ సిక్తాపట్నాయక్​సన్మానించి మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్​ బాషా షేక్, డీఆర్వో కిషన్​, డీపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.

వైభవంగా శ్రీవారి కల్యాణం

ఖానాపూర్,వెలుగు: ఖానాపూర్​లోని లక్ష్మీవేంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం ఆలయ అర్చకులు శ్రీమాన్ నరసింహమూర్తి,  నిమ్మగడ్డ సందీప్ శర్మ ధ్వజ ప్రతిష్ఠ చేశారు. మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, పుస్తెమట్టెలు ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం లక్ష్మీవేంకటేశ్వరుల కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, కౌన్సిలర్ కిశోర్ నాయక్ పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అడ్డగట్ల రాజన్న, కమిటీ సభ్యులు నిమ్మల రమేశ్, అంజయ్య, రమేశ్, రాము, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ వెంచర్లపై కొరడా

నిర్మల్/భైంసా, వెలుగు: నిర్మల్, భైంసాలోని అక్రమ వెంచర్లు, నిర్మాణాలపై కలెక్టర్​ముషారఫ్​అలీ ఫారూఖీ ఆదేశాలతో రెవెన్యూ ఆఫీసర్లు కొరడా ఝలిపించారు. శనివారం నిర్మల్​పట్టణంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు. భైంసా మండలం మాటేగాం, మీర్జాపూర్​లోని  అక్రమ వెంచర్ల హద్దురాళ్లను తొలగించారు. నిర్మల్ లోని మంచిర్యాల చౌరస్తా  వద్ద పార్కు స్థలం ఆక్రమణపై విచారణ చేశారు. భైంసాలో చేపట్టిన హద్దు రాళ్ల తొలగింపులో ఆర్డీవో లోకేశ్వర్​రావు, తహసీల్దార్​ చంద్రశేఖర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రేపు పత్తి కొనుగోళ్లు ప్రారంభం

భైంసా,వెలుగు: భైంసా కాటన్​మార్కెట్​యార్డులో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని ఏఎంసీ చైర్మన్​ పిప్పెర కృష్ణ, కార్యదర్శి ఆడెళ్లు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కొనుగోళ్లు ప్రారంభిస్తారన్నారు. రైతులు పత్తి దిగుబడులను మార్కెట్​కు తీసుకవచ్చి మద్దతు పొందాలన్నారు.