సమ్మక్క, సారలమ్మ  టెంపుల్ భూమికి ఎసరు పెట్టిన రియల్టర్!

 సమ్మక్క, సారలమ్మ  టెంపుల్ భూమికి ఎసరు పెట్టిన రియల్టర్!
  • అమీన్‌‌పూర్‌‌‌‌ మున్సిపాలిటీలో ఆగని కబ్జాలు
  • రూ.20 కోట్ల భూమి స్వాధీనానికి కొందరి యత్నం
  • పక్కనున్న అసైన్డ్ ల్యాండ్‌‌ ఆసరా చేసుకొని ఆక్రమణ 
  •  ఇప్పటికే ఎకరం భూమి చదును

సంగారెడ్డి, వెలుగు: అక్రమార్కులు ప్రభుత్వ, అసైన్డ్‌‌, శిఖం భూములే కాదు దేవుళ్ల భూములనూ వదలడం లేదు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్‌‌‌‌లోని సమ్మక్క, సారలమ్మ ఆలయ భూమిపై కన్నేసిన ఓ రియల్టర్‌‌‌‌ కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడు. అడ్డుకోవాల్సిన స్థానిక లీడర్లు అతనికి వత్తాసు పలుకుతూ అడ్డొచ్చిన దేవాలయ కమిటీ సభ్యులపై బెదిరింపులకు దిగుతున్నారు.  ఇప్పటికే  పక్కనున్న అసైన్డ్ భూమిని ఆసరా చేసుకొని టెంపుల్‌‌కు చెందిన భూమి చదును చేశారు.  ఇంత జరుగుతున్నా రెవెన్యూ, ఎండోమెంట్ ఆఫీసర్లు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

ఇలా కబ్జా చేస్తున్రు

అమీన్‌‌పూర్‌‌‌‌ సమ్మక్క సారలమ్మ టెంపుల్ జిల్లాలో చాలా ఫేమస్.  మేడారంలో జాతర జరిగే టైంలో ఇక్కడ కూడా ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో 2007లో అప్పటి సర్కారు సర్వే నెంబర్ 455లో రెండెరాల స్థలాన్ని కేటాయించింది.  ప్రస్తుతం అక్కడ ఎకరా రూ.10 కోట్లకుపైగా పలుకుతోంది.  దీంతో ఈ సర్వే నెంబర్‌‌‌‌కు పక్కనే ఉన్న అసైన్డ్‌‌  భూమిని అక్రమంగా కొనుగోలు చేసిన రియల్టర్‌‌‌‌ స్థానిక లీడర్లతో కలిసి టెంపుల్ భూమిని ఆక్రమించేందుకు ప్లాన్ వేశారు. అసైన్డ్‌‌ ల్యాండ్‌‌లో 20 గుంటల భూమిని శ్మశాన వాటిక కోసం కేటాయించగా, అంతమేర భూమి తగ్గిందనే సాకుతో టెంపుల్‌‌ భూమిని కలుపుకున్నారు.  ఇప్పటికే మట్టి పోసి ఎకరా భూమిని పోసి చదును చేశారు.   

పట్టించుకోని అధికారులు

యథేచ్ఛగా సమ్మక్క, సారలమ్మ టెంపుల్‌‌ భూమి ఆక్రమించుకుంటున్న రెవెన్యూ, ఎండోమెంట్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. స్థానిక లీడర్లు రియల్టర్‌‌‌‌తో కుమ్మక్కై అధికారులను మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం హద్దులు  పెట్టకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది.  కోట్ల మంది దైవంగా కొలిచే సమ్మక్క, సారలమ్మ ఆలయ భూమికే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని  స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ స్పందించి టెంపుల్‌‌ భూమిని కాపాడాలని కోరుతున్నారు. 

అసైన్డ్‌‌ పేరుతో కబ్జా చేస్తున్నరు

సమ్మక్క, సారలమ్మ ఉత్సవాలకు లక్షల మంది తరలివస్తారు. అసైన్డ్ భూమి పేరుతో కొందరు వ్యక్తులు అమ్మవార్ల భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు.  ఇప్పటికే స్థానిక తహసీల్దార్‌‌‌‌కు ఫిర్యాదు చేయగా వచ్చి పరిశీలించారు.  హద్దులు గుర్తించి గుడి భూములను కాపాడుతానని హామీ ఇచ్చారు.  ఆలయానికి ఇప్పుడున్న రెండెకరాలతో పాటు మరో రెండెకరాలు కేటాయించాలి.  
- నీలం భిక్షపతి, ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షుడు

త్వరలో హద్దులు నిర్ణయిస్తాం

అమీన్‌‌పూర్‌‌‌‌ సమ్మక్క సారలమ్మ ఆలయ భూమిని కబ్జా చేస్తే ఊరుకోం. సర్వే నెంబర్ 455ను త్వరలో సర్వే చేసి ఆలయ భూముల హద్దులు నిర్ణయిస్తాం. పక్కనే ఉన్న అసైన్డ్ భూములకు సంబంధించి  విక్రయాలు జరిగినట్టు విచారణలో తేలితే వాటిని కూడా స్వాధీనం చేసుకుంటాం.  
- దశరథ్,  అమీన్‌‌పూర్‌‌‌‌ తహసీల్దార్