ట్రంప్ ఓటమికి.. బైడెన్​ విజయానికి కారణాలు

ట్రంప్ ఓటమికి.. బైడెన్​ విజయానికి కారణాలు

మైగ్రెంట్స్

ఎన్నికల్లో బైడెన్​కు మైగ్రెంట్స్ నుంచి భారీ మద్దతు లభించింది. తెల్లజాతి పోలీసుల చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగిన తర్వాత.. ఆఫ్రికన్ అమెరికన్లు ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. బ్లాక్ లైవ్స్ మేటర్ అంటూ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. వారిని తమవైపు తిప్పుకోవడంలో డెమొక్రాట్స్​​ విజయం సాధించారు.  అక్రమంగా వలస వచ్చిన కోటి 10 లక్షల మందికి అమెరికా పౌరసత్వం ఇస్తామని ప్రచారంలో బైడెన్​ హామీ ఇవ్వడం కలిసి వచ్చింది.  డెమొక్రాట్స్​ పార్టీ  తరఫున ఉపాధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలా హారీస్​ పూర్వీకులది ఇండియా కావడంతో.. ఇండియన్​ అమెరికన్ల సపోర్ట్​ లభించింది. అక్రమ వలసదారులను వెనక్కి పంపేస్తామంటూ ట్రంప్​ పదే పదే చెప్పడం రిపబ్లికన్ పార్టీని దెబ్బకొట్టింది.

సీనియర్​ ఓటర్లు

రెండు దశాబ్దాలుగా  సీనియర్​ ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో  డెమొక్రాట్స్ వెనుకబడ్డారు. కానీ, ఈ సారి బైడెన్​కు సీనియర్​ ఓటర్లు అండగా నిలిచారు.  కరోనాను కట్టడి చేయడంలోనైనా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనైనా ట్రంప్​ కన్నా బైడెనే  బెస్ట్​ అని చాలా మంది సీనియర్లు భావించారు. 2016లో 65 శాతం మంది సీనియర్​ సిటిజన్స్​ ఓట్లను ట్రంప్​ సాధించారు. కానీ, ఈసారి సీనియర్లు ఆయనకు వ్యతిరేకంగా మారారు. యువత కూడా ట్రంప్​ను కాదని, బైడెన్​ దిక్కే నిలిచారు.

కరోనా

కరోనా కట్టడిలో ట్రంప్​ ఫెయిలయ్యారని, కనీసం ఆయన మాస్క్​ కూడా ధరించరని, దేశ ప్రజలకు కూడా ఎలాంటి పిలుపునివ్వరని బైడెన్​ తన ఎన్నికల ప్రచారంలో జనంలోకి బాగా తీసుకెళ్లగలిగారు. ఫస్ట్​ వేవ్​ ఉన్నప్పుడే కట్టడి చేస్తే  రెండు లక్షల మంది అమెరికన్లు చనిపోయేవారు కాదని అనేవారు. తాము పవర్​లోకి వస్తే దేశంలోని అందరికీ కరోనా వ్యాక్సిన్​ను ఫ్రీగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఒబామా కేర్ హెల్త్ బిల్లు అమలు విషయంలో ట్రంప్ మొండికేస్తున్నారని, దానికి బదులు కొత్తగా ఏదైనా తెస్తారంటే అదీ తేవడం లేదని, తాము అధికారంలోకి వస్తే కేర్​ హెల్త్​ బిల్లు కోసం వచ్చే పదేండ్లలో 70 బిలియన్ డాలర్లు ఖర్చుచేస్తామని చెప్పారు. అయితే, కరోనా విషయంలో చైనాను, ఇతర దేశాలను రోజూ వేలెత్తి చూపే ట్రంప్​.. తాను కరోనా కట్టడికి ఏం చేస్తున్నానన్నది జనంలోకి తీసుకెళ్లలేకపోయారు.

ట్రంప్ టెంపరితనం

ప్రెసిడెంట్​గా  బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్​ అనుసరించిన తీరు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. పాలసీల్లో కానీ, మాట తీరులో కానీ ఆయన దురుసుతనం అమెరికన్లలో వ్యతిరేకతకు దారితీసింది.  మైనార్టీల విషయంలో, మైగ్రెంట్స్​ విషయంలో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. మైనార్టీలు, మైగ్రెంట్స్​కు ట్రంప్​ వ్యతిరేకి అన్న భావన చొచ్చుకుపోయింది. దీంతో ప్రత్యామ్నాయంగా బైడెన్​కు చాన్స్​ ఇవ్వాలని అమెరికా ఓటర్లు భావించారు.