కానిస్టేబుల్​ అభ్యర్థితో ఎస్ఐ అసభ్య ప్రవర్తన  

కానిస్టేబుల్​ అభ్యర్థితో ఎస్ఐ అసభ్య ప్రవర్తన  
  • ఎత్తు, కొలతలు చూస్తానని పైశాచికానందం
  • భార్య లేదని ఇంటికి రమ్మని వేధింపులు 
  • ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పీఎస్​లో బాధితురాలి ఫిర్యాదు  

ఆసిఫాబాద్ : కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్​ కావడానికి తనకు స్థోమత లేదని, మెటీరియల్ ​ఉంటే ఇచ్చి సాయం చేయాలని అడిగిన ఓ యువతితో కుమ్రంభీం జిల్లా రెబ్బెన ఎస్ఐ భవానీ సేన్ అసభ్యంగా ప్రవర్తించాడు. స్టేషన్ కి వస్తే బుక్స్​ ఇస్తానని పిలిచి లైంగిక వేధింపులకు దిగాడు. దీంతో సదరు బాధితురాలు రెబ్బెన పీఎస్​లో ఎస్ఐపై కంప్లయింట్​ చేసింది. ఆమె ఫిర్యాదు ప్రకారం..ఇటీవల రాష్ట్ర సర్కారు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​రిలీజ్​ చేసింది. దీంతో పోలీసు కావాలని కలలు కంటున్న మండలానికి చెందిన ఓ యువతి ఎస్సై భవానీసేన్​ను ఆశ్రయించింది. సూచనలు, సలహాలు చెప్పాలని కోరింది. ఈ క్రమంలో ఆమెకు మెటీరియల్ ఇస్తానని భరోసా ఇచ్చాడు. కానిస్టేబుల్ ​కావాలంటే బుక్స్​చదివితేనే సరిపోదని, పోస్టులకు తగ్గట్టు ఫిజిక్​ ఉండాలన్నాడు. లేకపోతే జాబ్ ​రాదని, ఎత్తు, ఇతర మెజర్​మెంట్స్​చూస్తానని కొద్దిరోజుల కింద పోలీస్ స్టేషన్ కు పిలిపించాడు. కొలతల పేరుతో యువతి ప్రైవేట్​పార్ట్స్​తాకుతూ పైశాచికానందం పొందాడు. దీంతో ఎస్ఐ ప్రవర్తన నచ్చక ఆమె ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. మరుసటి రోజు నిజంగా మెటీరియల్​ ఇస్తానని పీఎస్​కు రమ్మన్నాడు. నమ్మి రావడంతో మెటీరియల్​ ఇవ్వకపోగా, ‘ఇంట్లో నా భార్య లేదు. నువ్వు ఇంటికి రా ’ అంటూ అసభ్యంగా మాట్లాడాడు. దీంతో వేధింపులు భరించలేక కుటుంబసభ్యులకు విషయం చెప్పి మంగళవారం రెబ్బన పోలీస్​స్టేషన్​లో కంప్లయింట్ ​చేసింది. 

ప్రజాసంఘాల ఆందోళన
యువతిని లైంగికంగా వేధించిన సబ్​ ఇన్​స్పెక్టర్​ను కఠినంగా శిక్షించాలని కాగజ్ నగర్ లోని రాజీవ్ చౌరస్తాలో ఎస్ఐ భవానీ సేన్ దిష్టిబొమ్మ ప్రజాసంఘాలు దహనం చేశాయి. ఐద్వా లీడర్ ​ముంజం అనంజ్ మాట్లాడుతూ ఎస్​ఐని కఠినంగా శిక్షించకపోతే ఆందోళనలు  ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎస్పీ ఆఫీసుకు అటాచ్​
ఘటనను సీరియస్​గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఎస్సై భవానీ సేన్ ను ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు విషయమై ఎస్పీ కె.సురేశ్​కుమార్ మాట్లాడుతూ ఎస్ఐ భవానీ సేన్ పై ఐపీసీ 354 సెక్షన్​ కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామన్నారు. తప్పు ఉందని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ఇదే పోలీస్ స్టేషన్​లో పని చేస్తున్న కొంతమంది మహిళా కానిస్టేబుల్స్​తో కూడా ఎస్ఐ అసభ్యంగా ప్రవర్తించేవాడన్న ఆరోపణలు వస్తున్నాయి. స్టేషన్​కు వచ్చే మహిళలనూ వేధించేవాడని తెలుస్తోంది.