రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన అనర్హత అస్త్రం

రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన అనర్హత అస్త్రం

మహారాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎత్తులు, ఫై ఎత్తులతో పాలిటిక్స్ ఫుల్ ఇంట్రస్టింగ్ గా మారాయి. తాజాగా శివసేన రెబల్ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏక్ నాథ్ షిండేను లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. తామే అసలైన బాల్ థాకరే వారసులమని.... అసలు శివసేన పార్టీ తమదే అని చెప్తున్నారు రెబల్ ఎమ్మెల్యేలు.


మరోవైపు సీఎం థాకరే వర్గం కూడా వేగంగా పావులు కదుపుతోంది. రెబల్స్ పై అనర్హత అస్త్రం ప్రయోగించింది. 12 మంది ఎమ్మెల్యేలపై శివసేన అనర్హత పిటిషన్ వేసింది. ఐతే ఎమ్మెల్యేలపై అనర్హత చెల్లదన్న షిండే వర్గం వాదిస్తోంది. మెజార్టీ పార్టీ ఎమ్మెల్యేలు తమ దగ్గరే ఉన్నారని చెప్తున్నారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని అంటున్నారు. 


మరోవైపు MLA అనర్హత సిఫారసుపై స్పందించారు ఏక్ నాథ్ షిండే. తాము.. బాలాసాహెబ్ థాక్రే వారసులమని ఎవరి బెదిరింపులకు భయపడమన్నారు. తమకు చట్టం తెలుసని.. చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామంటూ ట్వీట్ చేశారు. అలాగే.. శాసనసభాపక్ష నాయకుడిగా తన నియామకాన్ని కొనసాగించాలంటూ డిప్యూటీ స్పీకర్ కు లేఖ రాశారు షిండే. పార్టీ చీఫ్ విప్ గా.. గొగావాలె ను కొనసాగించాలన్నారు. ఎమ్మెల్యేల సంతకాలతో డిప్యూటీ స్పీకర్, గవర్నర్, అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాశారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షిండే గ్రూపులో చేరినట్టు తెలుస్తోంది. దీంతో షిండేకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య 42 కు చేరిందని ఆ వర్గం చెబుతోంది. ఏడుగురు స్వతంత్రులతో కలిసి మొత్తం 49 మంది ఏక్ నాథ్ షిండేకు సపోర్ట్ గా ఉన్నారు. 

గురువారం సీఎం ఉద్దవ్ థాకరే ఏర్పాటు చేసిన సమావేశానికి కేవలం 13మంది MLA లే హాజరయ్యారు.  10 మంది ఎంపీలు కూడా షిండే గ్రూపులో చేరినట్లు తెలుస్తోంది. ఇక తమ లీడర్ షిండే నే అంటూ రెబల్ ఎమ్మెల్యేలు వీడియో రిలీజ్ చేశారు. ఉద్ధవ్ ను విబేధించడానికి కారణాలపై ఏక్ నాథ్ షిండే వర్గం 3 పేజీల బహిరంగ లేఖను విడుదల చేసింది. సీఎం ఇంటిని పబ్లిక్ ఇన్నాళ్లకైనా చూసేందుకు అవకాశం దొరికిందన్నారు. సీఎం ఇంటి తలుపులు ఇప్పుడు నిజంగా తెరుచుకున్నాయని లేఖలో ప్రస్తావించారు. ఇన్నాళ్లూ సీఎం ఎవరినీ కలిసే వారు కాదని.. ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా తమను అవమానించేలా వ్యవహరించారని లేఖలో ఫైర్ అయ్యారు. 

ఇక సీఎంతో చర్చలు జరిపేందుకు రెబల్స్ కి ఇప్పటికీ అవకాశం ఉందన్నారు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్. రెబల్స్ కోరుకుంటే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 24 గంటల్లో ఎమ్మెల్యేలు ముంబైకి తిరిగి వస్తే సమస్యలపై సీఎం ఉద్ధవ్ థాక్రేతో నేరుగా చర్చించవచ్చని చెప్పారు. ఏక్ నాథ్ షిండే తీరుపై మండిపడ్డారు శివసేన మిత్రపక్షం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. అసెంబ్లీలో షిండే బలం నిరూపించుకోవాలన్నారు పవార్. ఏ పరిస్థితుల్లో ఐనా శివసేనకు అండగా ఉంటామన్నారు.