సేఫ్టీ కోసమే ప్రగతి భవన్​లో ఉంటున్నం: గువ్వల బాలరాజు

సేఫ్టీ కోసమే ప్రగతి భవన్​లో ఉంటున్నం: గువ్వల బాలరాజు

హైదరాబాద్‌, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం బయట పెట్టిన తర్వాత తమను చంపుతామని బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, సేఫ్టీ కోసమే ప్రగతి భవన్‌లో ఉంటున్నామని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తమను ఎవరూ నిర్బంధించలేదని స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన పార్టీ జాయింట్​ మీటింగ్​కు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, రోహిత్​రెడ్డి, హర్షవర్ధన్​ రెడ్డిలు సీఎం కేసీఆర్​తో కలిసి వచ్చారు.

సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో కేసీఆర్‌కు అందుబాటులో ఉండటానికే ప్రగతి భవన్‌లో ఉంటున్నామన్నారు. తమను ఇబ్బందిపెట్టే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసిన బీజేపీని దోషిగా నిలబెడుతామన్నారు. కేసీఆర్‌ వదిలిన బాణంలా తాము పని చేస్తామని వివరించారు.

రానున్న రోజుల్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారు. రూ.100 కోట్లు తీసుకొని కనిపించకుండా పోయామని నియోజకవర్గంలో పోస్టర్లు వేస్తున్నారని, వారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తామన్నారు.