గోప్యత ప్రాథమిక హక్కే

గోప్యత  ప్రాథమిక హక్కే

విడాకులు, భరణానికి సంబంధించిన ఓ కేసు విచారణలో  ఇటీవల ఛత్తీస్‌‌‌‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. కేసు విచారణలో వెలుగుచూసిన కొత్తకోణంపై చర్చ మొదలైంది. సొంత భార్యాభర్తలైనా సరే ఒకరికి తెలియకుండా మరొకరి కాల్స్ రికార్డ్ చేయడం అనేది గోప్యత హక్కుకు పాతర వేయడమేనని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్ హవా నడుస్తోంది.  ఆ ప్రపంచాన్నే మనం వర్చువల్ వరల్డ్ అంటున్నాం. 

పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోకపోతే ఆధునిక యుగంలో ఆంతరంగిక స్వేచ్ఛ అన్నది ఒక అభూతకల్పనగా మారే ప్రమాదం ఉన్నదని సైబర్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే సోషల్‌‌‌‌ మీడియాలో మరెన్నో నెట్‌‌‌‌వర్కింగ్ సైట్లలో ఎన్నో విధాలుగా అనేకమంది పౌరులు వారికి వారే తమ సమాచారాన్ని చేజేతులారా జార విడుస్తూ ఆంతరంగిక స్వేచ్ఛను కోల్పోతున్నారు. అదేవిధంగా పౌరులు ఆధార్‌‌‌‌కార్డును తమ బ్యాంక్ అకౌంట్లను, ప్రభుత్వ రాయితీలు పొందడానికి జతపర్చితే తమ ఆంతరంగిక స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వ్యక్తిగత గోప్యత

1948లో ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మానవ హక్కుల ప్రకటనలోని ఆర్టికల్ 12, ఇంటర్నేషనల్ కోవెనంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్‌‌‌‌లోని ఆర్టికల్ 17, యూరోపియన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌‌‌‌లోని ఆర్టికల్ 8లో ఇండ్లు, కుటుంబం, దాంపత్య జీవనం, సంతానోత్పత్తి, విద్యాభ్యాసం మొదలైనవి మానవ ఆంతరంగిక వ్యవహారాలని అవి వ్యక్తిగత గోప్యతలోని ప్రధాన విషయాలని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యత అనేది  జీవించే హక్కులో భాగంగా ఉంటుంది. 

ఎటువంటి ఆధారాలు లేకుండా  ఇతరులపై పదేపదే అసత్య ఆరోపణలు చేయడం, ఎదుటివారి అనుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారం పొందే ప్రయత్నం చేయడం, ఫోన్ సంభాషణలను రికార్డ్ చేయడం, ఫొటోలు తీయటం లేదా ఫోన్, కంప్యూటర్​లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా తీసుకోవడం వంటి వాటిని గోప్యతను హరించేవిగా పరిగణించవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వివిధ రకాల కంపెనీలు కూడా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా వివిధ రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం ముందుగా ఒప్పందం చేసుకొని, సర్వేల పేరుతో ప్రజల  వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని విశ్లేషణ చేస్తుంటాయి. అందువల్ల సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తమ వ్యక్తిగత వివరాలను ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంచడం అంత మంచిది కాదు. 

అదేవిధంగా వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండటం మంచిదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తెలియని వారికి ఎటువంటి వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకూడదు. కొంతమంది సైబర్ నేరగాళ్లు మన ఖాతాల్లో ఉన్న డబ్బులు గుంజేయాలనే ఉద్దేశ్యంతో మనకు వివిధ రూపాల్లో ఫోన్లు చేస్తుంటారు. వీటికి మనం స్పందించకూడదు. రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతిక  పరిజ్ఞానంపై కూడా అవగాహన పెంచుకోవాలి.ఫేస్​బుక్​ వంటివి ఎక్కువగా హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

కాబట్టి జరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. మనుషుల మధ్య సంబంధాలు బలంగా ఉండాలంటే వ్యక్తిగత గోప్యత చాలా అవసరం. ఎందుకంటే ప్రతి బంధానికి ఒక సరిహద్దు ఉండాలి. హద్దుమీరి ఎదుటివారి విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవడం ఎవరికీ మంచిది కాదు. పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం ఎవరికైనా మంచిది.అదే విధంగా  ప్రాథమిక హక్కులో అత్యంత ముఖ్యమైన జీవించే హక్కులో భాగమైన గోప్యతా హక్కును కాపాడాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాలు, ఇటు అధికారులపై ఉంది.

– యం. రాం ప్రదీప్, తిరువూరు