ఆర్థిక మాంద్యంలో జర్మనీ

ఆర్థిక మాంద్యంలో జర్మనీ

ఐరోపాకి గుండెకాయ వంటిది జర్మనీ. కాబట్టి అది ఆర్థిక మాంద్యంలో పడితే యూరప్ దేశాలన్నీ కలవరపడతాయి. జర్మనీ జీడీపీ 2023 మొదటి త్రైమాసికం(జనవరి–-మార్చి)లో 0.3 శాతం క్షీణించింది. జర్మనీ 2022 కడపటి (అక్టోబర్–-డిసెంబర్) త్రైమాసికంలోనూ జీడీపీలో 0.5 శాతం తగ్గుదలను నమోదు చేసింది. ఇలా వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోవడం సాంకేతికంగా ఆర్థిక మాంద్యం కిందకే వస్తుంది. కరోనా కారణంగా జర్మనీ 2020 ప్రారంభంలోనూ ఆర్థిక మాంద్యాన్ని చవిచూసింది. 

వాస్తవిక పరిస్థితి..

గణాంకాలను పక్కనపెట్టి ఆర్థిక మాంద్యం ప్రభావం జర్మనీలో వాస్తవికంగా ఎలా ఉందో చూద్దాం. జర్మనీలో ద్రవ్యోల్బణం ప్రస్తుతం రికార్డు స్థాయిలో 7.4 శాతంగా ఉంది. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో కుటుంబాల ఆదాయమంతా ఇంటి ఖర్చులకే సరిపోతోంది. జనం అత్యవసర ఖర్చులకే పరిమితమవుతున్నారు. ఇతర వినియోగ వ్యయం తగ్గింది. గృహస్తులు షాపింగ్ కు కళ్లెం వేస్తున్నారు. బయటకెళ్లి రెస్టారెంట్లలో తినడానికి వెనుకాడుతున్నారు. మోజుపడ్డ దుస్తులు, ఫర్నిచర్ కొనడం లేదు. ప్రభుత్వ వ్యయం కూడా అంతకుముందు త్రైమాసికాలతో పోలిస్తే ఈ ఏడాది మొదటి త్రైమాసికలో 4.9 శాతం తగ్గింది. ఫలితంగా, డిమాండ్ తగ్గింది. కుటుంబాల వినియోగ వ్యయం ఎదుగూబొదుగూ లేకుండా ఉంది. నిర్మాణ కార్యకలాపాలు మందగించాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. పరిశ్రమలకు ఆర్డర్లు పలుచబడ్డాయి. 

భారతీయ విద్యార్థుల ఇబ్బందులు

ముఖ్యంగా ఉన్నత చదువుల నిమిత్తం జర్మనీ వెళ్లిన విద్యార్థులకు ఆర్థిక మాంద్యం సెగ బాగా తాకుతోంది. ఉక్రెయిన్​ యుద్ధం మొదలైనప్పటి నుంచి పాలు, వంట నూనెలు, కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయని భారతీయ విద్యార్థులు వాపోతున్నారు. విద్యుచ్ఛక్తి, నీటి బిల్లుల భారం కూడా నడ్డివిరుస్తోందని చెబుతున్నారు. ఆదాయం పెంచుకునేందుకు ఇండ్ల యజమానులు అద్దెలను పెంచేశారని కూడా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలుపుతున్నారు. విమాన చార్జీలు పెరగడంతో ఇదివరకటిలా ఇండియాకు వచ్చి వెళ్లడం కూడా  కష్టమవుతోంది. 

ప్రభుత్వ ప్రయత్నాలు

చాన్సలర్ ఒలాఫ్ షోర్జ్స్ నేతృత్వంలోని జర్మనీ ప్రభుత్వం ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని తగ్గించడానికి రకరకాల చర్యలు తీసుకుంటోంది. వ్యాపార సంస్థలకు, వినియోగదారులకు విరివిగా రుణ సదుపాయాలు కల్పిస్తోంది. మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు నిధులు వెచ్చిస్తోంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతూ వస్తున్నా ద్రవ్యోల్బణం తగ్గించడంపై దాని ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది.  కంపెనీలు వాటి ఉద్యోగులకు 3000 యూరోల చొప్పున బోనస్ లు చెల్లించవచ్చని వాటిపై ఎలాంటి పన్నులు చెల్లించనవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. యాభై యూరోలతో టికెట్ కొంటే నెలరోజుల పాటు జర్మనీలో ఎక్కడికైనా వెళ్లిరాగల పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అలా ప్రజా రవాణా వ్యవస్థలకు ఊపిరిపోస్తోంది. ప్రోత్సాహకాలు తగ్గిపోవడంతో బ్యాటరీతో నడిచే కార్లు కొనేవారి సంఖ్య కూడా జర్మనీలో తగ్గింది. ఆర్థిక మాంద్యం మరింత బలపడకుండా జర్మన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు ఫలితమిస్తాయో మున్ముందు తెలుస్తుంది.  ప్రస్తుత మాంద్యానికి ఉక్రెయిన్​యుద్ధమే కారణం. ఆ దేశంపై రష్యా దురాక్రమణ మొదలైనప్పటి నుంచి యూరోపియన్ దేశాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. జర్మనీలోనూ ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఇది వ్యాపారాలు, వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపింది. సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. యూరప్ లో జర్మనీదే పెద్ద ఆర్థిక వ్యవస్థ. దాని ఆర్థిక అనారోగ్యం ఇరవై దేశాల యూరో జోన్ పై ప్రభావం చూపుతోంది. యూరప్ లోని మరికొన్ని దేశాలు ఇప్పటికే ఆర్థిక మాంద్యంలో ఉన్నాయి.

 

భారత్​లో జర్మనీ పెట్టుబడులు..

భారత్ లో రవాణా సదుపాయాలు, విద్యుత్ పరికరాలు, లోహ పరిశ్రమలు, రసాయనాలు, నిర్మాణ కార్యకలాపాలు, సేవలు(ముఖ్యంగా బీమా), ఆటోమొబైల్స్ రంగాల్లో జర్మనీ పెట్టుబడులు మొత్తం మీద 13.6 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువకు పైగానే ఉన్నాయి. నిజానికి, ప్రపంచంలో నాల్గవ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ చాలా కాలంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి వాటికి రష్యాపై ఆధారపడుతోంది. ఉక్రెయిన్​ యుద్ధం కారణంగా, ఆ సరఫరాలు నిలిచిపోవడంతో జర్మనీ ఇబ్బందుల్లో పడింది. ఇపుడు కాలుష్య రహిత ఇంధన ఉత్పాదన వనరులను భారీయెత్తున విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. సెమికండక్టర్లు, బ్యాటరీ ఫ్యాక్టరీలపై పెద్ద మొత్తాలను పెట్టుబడి పెడుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా మందగతిన సాగుతోంది. యూరోపియన్ దేశాల్లో జర్మనీ, బ్రిటన్ లు 2023లో ఆర్థిక మాంద్యంలోకి జారుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. జర్మనీ కన్నా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండవచ్చని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జివా చెబుతున్నారు.  ఏదిఏమైనా ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ ఆగితేనే అన్ని దేశాలకు మేలు. కానీ, ఉక్రెయిన్ లోని జనావాసాలపైన రష్యా ఆది నుంచి దాడులు చేస్తూనే ఉంది. రష్యాలోని జనావాసాలపై డ్రోన్లతో దాడిని ఉక్రెయిన్ ఈ మధ్యనే మొదలుపెట్టింది. అంతంకాదిది ఆరంభం అంటే ఇదేనేమో. ఈ లెక్కన మరికొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవడం ఖాయం.

భారతదేశానికి కూడా బెడద

జర్మనీ మాంద్యం భారత ఆర్థిక వ్యవస్థ పైన కూడా పెను ప్రభావమే చూపనుంది. జర్మనీకి మనం యంత్ర పరికరాలు, స్మార్టు ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్ వస్తువులు, సేంద్రియ రసాయనాలు, పాదరక్షలు, మోటారు వాహనాల విడిభాగాలు, ఇనుము, ఉక్కు ఉత్పత్తులు, తోలుతో తయారు చేసిన వస్తువులు ఎగుమతి చేస్తున్నాం. ఇవన్నీ మనకు కోట్లకొద్దీ అమెరికన్ డాలర్లు తెచ్చిపెడుతున్నాయి. అయితే, ఇనుము, ఉక్కు ఉత్పత్తులపై కార్బన్ సరిహద్దు పన్ను విధించాలని జర్మనీ భావిస్తోంది. అది మన ఎగుమతులపై ప్రభావం చూపవచ్చు. ఐరోపాకి సంబంధించినంత వరకు జర్మనీ తర్వాత నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ, ఫ్రాన్స్ లకు భారత్ ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే, భారతదేశానికి జర్మనీ తొమ్మిదవ పెద్ద పెట్టుబడిదారుగా ఉంది. విదేశాల్లో పెట్టుబడులతోనన్నా  లాభాలు గడిద్దామని కంపెనీలు భావిస్తాయి కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ లో జర్మనీ పెట్టుబడులకు అంతరాయం ఉండకపోవచ్చు. 

తోడ్పాటూ ఉంది

స్థానిక విద్యార్థుల మాదిరిగానే భారతీయ విద్యార్థులతో సహా అంతర్జాతీయ విద్యార్థులెవరూ జర్మనీలో ట్యూషన్ ఫీజులు చెల్లించనవసరం లేదు. విద్య ఉచితం. అనేక మంది పైచదువులకు జర్మనీ వెళ్లడానికి అది కూడా ఒక కారణం. జర్మనీలో 91,126 మంది అంతర్జాతీయ విద్యార్థులున్నారని ఒక అంచనా. వారిలో చైనీయులు (40,055) అత్యధికులు కాగా, 33,753 మంది విద్యార్థులతో భారత్ రెండవ స్థానంలో ఉంది. ఇక రకరకాల వృత్తి వ్యాసంగాలలో ఉన్న భారతీయులు జర్మనీలో 2 లక్షల మంది వరకు ఉంటారు. పెరిగిన జీవన వ్యయాన్ని తట్టుకునేందుకు జర్మనీ ప్రభుత్వం విద్యార్థులందరికీ నెలకు 200 యూరోల చొప్పున సబ్సిడీ ఇస్తోంది. ఇతర దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు అదనపు ఆదాయం కోసం వారానికి 20 గంటలపాటు పనిచేయడానికి జర్మనీలో వీలుంది. పనిచేసిన గంటలను బట్టి విదేశాల్లో పైకం ఇస్తారన్న సంగతి చాలా మందికి తెలిసిన విషయమే. మిగిలిన పౌరుల మాదిరిగానే వీరూ ప్రస్తుతానికి ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావంతో ఉన్నారు.

-మల్లంపల్లి ధూర్జటి, సీనియర్ జర్నలిస్ట్