ఆర్థిక మాంద్యంలోకి మూడోవంతు ప్రపంచం : ఐఎంఎఫ్ చీఫ్

ఆర్థిక మాంద్యంలోకి మూడోవంతు ప్రపంచం :  ఐఎంఎఫ్ చీఫ్

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో వంతు ప్రపంచ దేశాలు ఈ ఏడాది ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ముప్పు ఉందని హెచ్చరించారు. అమెరికా, చైనా,  ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశాలు ఉన్నందున.. కిందటి ఏడాది కంటే ఈ సంవత్సరం  సంక్లిష్టంగా ఉండొచ్చన్నారు. ‘‘కొన్ని దేశాలు ఆర్థిక మాంద్యంలో లేనప్పటికీ.. అక్కడ నివసించే కోట్లాది మంది ప్రజలు ఆర్థిక మాంద్యపు ప్రభావాన్ని చవిచూసే చాన్స్ ఉంటుంది’’ అని ఐఎంఎఫ్ చీఫ్ కామెంట్ చేశారు.  

‘‘ఈ ఏడాది వచ్చే కొన్ని నెలల పాటు చైనాకు కష్టకాలమే. చైనా వృద్ధిరేటు మందగించే అవకాశం ఉంది. ఈ ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై కూడా పడుతుంది’’ అని ఆమె విశ్లేషించారు. కాగా, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిరేటు అంచనాలను ఐఎంఎఫ్  ఏటా విడుదల చేస్తుంటుంది. 2021లో 6 శాతం, 2022లో 3.2 శాతం వృద్ధిరేటులను అంచనా వేసిన ఐఎంఎఫ్.. 2023 సంవత్సరానికి కేవలం 2.7 శాతం వృద్ధిరేటే సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. ఈ అంచనాలకు ఊతమిచ్చేలా ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.