చదువుతోనే సమాజంలో గుర్తింపు..ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

చదువుతోనే సమాజంలో గుర్తింపు..ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు : చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని, ప్రతిఒక్కరూ కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పయనీర్ ఎప్సెట్, నీట్ ఎంట్రెన్స్ టెస్ట్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 20 నెలలుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తను పనిచేస్తున్నట్లు తెలిపారు. 

మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తన సొంత ఖర్చులతో కార్పొరేట్ స్థాయిలో ఎంసెట్, నీట్ ఎంట్రెన్స్ లో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. గతేడాది పయనీర్ కార్యక్రమంలో 200 మంది విద్యార్థులు శిక్షణ తీసుకొనగా,116 మంది ఉత్తమ ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ విద్యాసంవత్సరం వంద శాతం ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. 

పయనీర్ కార్యక్రమంలో వంద శాతం హాజరు ఉన్న విద్యార్థులకు రూ.10,116 నగదు బహుమతి ఇస్తానని రిషి విద్యాసంస్థల డైరెక్టర్ వెంకటయ్య ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సీజే బెనహార్, డీఐఈవో కౌసర్ జహాన్, బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి, ప్రభుత్వ ఎంవీఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భీంరెడ్డి, ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ జంగయ్య, వాగ్దేవి జూనియర్ కళాశాల డైరెక్టర్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.