దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ విమాన ప్రయాణాలు మొదలుకాబోతున్నాయి. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన విమాన సర్వీసులను సోమవారం నుంచి ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే పౌర విమానయాన శాఖ వెల్లడించింది. దశల వారీగా తొలుత 33 శాతం దేశీయ విమాన సర్వీసులు స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే రెండు నెలలుగా విమానాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో ఆదాయం ఎయిర్ లైన్స్ సంస్థలకు పూర్తిగా ఆదాయం పడిపోయింది. దీంతో కంపెనీలు విమాన చార్జీలు భారీగా పెంచే చాన్స్ ఉండడంతో ఫ్లైట్ టికెట్ ధరలపై పౌర విమానయాన శాఖ నియంత్రణ విధించింది. విమానాలు ప్రయాణించే రూట్లను ఏడు కేటగిరీలుగా విభజించి.. టికెట్ ధర రూ.2 వేల నుంచి రూ.18,600 దాటకుండా ఉండాలని పరిమితి విధించింది. ఈ మేరకు ఆయా రేట్లు అమలయ్యేలా చూడాలని డీజీసీఏకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు పౌర విమానయాన శాఖ జాయింట్ సెక్రెటరీ సత్యేంద్ర కుమార్ మిశ్రా.
కేటరిగీలు.. టికెట్ ధరల లిమిట్
– విమాన ప్రయాణ సమయం 40 నిమిషాల కంటే తక్కువగా ఉంటే A కేటగిరీ: ఇందులో కనిష్ఠ ధర రూ.2 వేలు, గరిష్ఠ ధర రూ.6 వేలు.
– విమాన ప్రయాణ సమయం 40 నుంచి 60 నిమిషాల మధ్య ఉంటే B కేటగిరీ రూట్.. ఈ కేటగిరీలో కనీస ధర రూ.2,500, గరిష్ఠ ధర రూ.7500
– ట్రావెలింగ్ టైమ్ 60 – 90 నిమిషాల మధ్య ఉంటే C కేటరిగీ.. ఈ రూట్లలో కనీస ధర రూ.3 వేలు, మ్యాగ్జిమం రేటు రూ.9 వేలు
– విమాన ప్రయాణ సమయం 90 – 120 నిమిషాల మధ్య ఉంటే D కేటగిరీ: ఇందులో రూ.3500 నుంచి రూ.10 వేల మధ్య టికెట్ ధర ఉండాలి.
– ప్రయాణ సమయం 120 – 150 నిమిషాల మధ్య ఉంటే E కేటగిరీ: ఈ రూట్లో టికెట్ ధర రూ.4500 నుంచి రూ.13 వేలు దాటకూడదు.
– ట్రావెలింగ్ టైమ్ 150 – 180 నిమిషాల మధ్య ఉంటే F కేటగిరీ: ఈ రూట్ లో ప్రయాణించే ఫ్లైట్ టికెట్ రూ.5,500 నుంచి 15,700 మధ్య ఉండాలి.
– విమాన ప్రయాణ సమయం పూర్తవడానికి మూడు గంటల నుంచి మూడున్నర గంటల మధ్య టైమ్ పట్టే రూట్లను G కేటగిరీగా నిర్ణయించింది విమానయాన శాఖ. ఈ రూట్లలో ప్రయాణించే ఫ్లైట్ టికెట్ల ధరలు రూ.6500 నుంచి 18600 దాటకూడదని స్పష్టం చేసింది.
