
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని ఓపెన్ ప్లాట్లకు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. బుధవారం హౌసింగ్ బోర్డ్ అధికారులు వేలం నిర్వహించారు. కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్ లోని ప్లాట్ నంబర్1 కు చెందిన ఒక ఎకరం విస్తీర్ణంలోని కమర్షియల్ ఓపెన్ ల్యాండ్‌ను రూ.65.34 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు. ఆన్లైన్ ద్వారా వేలం పాట నిర్వ హించినందున బిడ్డర్ల వివరాలు చివరి నిమి షం వరకు ఎవరికీ తెలియలేదు.
బిడ్డర్లు స్వేచ్ఛగా ధరను కోట్ చేసే అవకాశం లభించడంతో ఎకరం ధర రికార్డు స్థాయికి చేరింది. ఈ స్థలానికి సంబంధించిన వేలం పాటకు మొత్తం 11 బిడ్లు దాఖలు కాగా, నలుగురు బిడ్డర్లు వేలం పాటలో పాల్గొన్నారని హౌజింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అక్కౌంటెన్సీ ఆఫ్ ఇండియా సంస్థ వారు ఈ ఎకరా విస్తీర్ణం భూమిని రూ.65.34 కోట్లకు వేలం పాటలో కొనుగోలు చేసినట్టు ఆయన తెలిపారు.