
నల్గొండ/హాలియా, వెలుగు : ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. సంవత్సరకాలానికి పెట్టుకున్న టార్గెట్‌ను కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేశారు. 2025 – 26 సంవత్సరానికి 1400 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకోగా... సెప్టెంబర్ 30 నాటికే ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు. కేవలం మూడు నెలల్లోనే టార్గెట్‌ను చేరుకోవడంతో ఇంజినీర్లు జెన్‌కో ఆఫీస్‌లో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఇంజినీర్లు, సిబ్బందిని సాగర్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ మంగేశ్ నాయక్ అభినందించారు.
ఎనిమిది యూనిట్ల ద్వారా 8.15 మెగావాట్ల ఉత్పత్తి
నాగార్జునసాగర్ వద్ద నిర్మించిన తెలంగాణ వైపు నిర్మించిన పవర్‌హౌస్‌లో మొత్తం 8 యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇందులో మొదటి యూనిట్ పనిచేయకపోవడంతో 20 నెలలుగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. ఆగస్ట్‌లో రిపేర్లు పూర్తి కావడంతో ఆ యూనిట్ సైతం అందుబాటులోకి వచ్చింది. మొత్తం 8 యూనిట్ల ద్వారా 8.17 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. రిజర్వాయర్‌లో 580 అడుగుల మేర నీరు ఉన్నప్పుడు సాధారణంగానే విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువగా నీరు ఉంటే... విద్యుత్ ఉత్పత్తి చేశాక విడుదలైన నీటిని రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా తిరిగి రిజర్వాయర్‌లోకి పంపే వీలు ఉంటుంది.
గతంలోనూ...
నాగార్జునసాగర్ మెయిన్ పవర్ హౌస్ ద్వారా 2021 – --22 ఆర్థిక సంవత్సరంలో 1535 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోగా... ఆ సంవత్సరం 2,262 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేశారు. 2022– -23లో 1,500 మిలియన్ యూనిట్లకు 2,355 మిలియన్ యూనిట్లు, 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి 1,400 మిలియన్ యూనిట్లు టార్గెట్ పెట్టుకోగా... నీటి లభ్యత లేని కారణంగా కేవలం 540 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేశారు. ఇక 2024- – 25 సంవత్సరంలో 1,400 మిలియన్ యూనిట్ల లక్ష్యానికి 1,922 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు.