- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లాలో ఎలాంటి కోతలు లేకుండా రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు జరిగాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. 2025-–26 యాసంగి సీజన్‌లో జిల్లాలో 5.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 436 కేంద్రాల ద్వారా 5.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
వీటికి సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.1,075 కోట్లు జమ చేశామని స్పష్టం చేశారు. దీంతోపాటు 47 వేల టన్నుల మక్కలు కొన్నట్లు చెప్పారు. ధాన్యంలో కోతలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
