కెమికల్స్ వాడితే 16 ఏళ్లకే భయంకరమైన రోగాలు.. .ప్రకృతి వ్యవసాయం చేయండి: బండి సంజయ్

కెమికల్స్ వాడితే 16 ఏళ్లకే భయంకరమైన రోగాలు.. .ప్రకృతి వ్యవసాయం చేయండి: బండి సంజయ్

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాబోయే రెండేళ్లలో కనీసం 25 వేల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని  కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. రసాయనాలతో కూడిన ఆహారం తినడం వల్లే సమాజంలో రోగాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 గతంలో 90 ఏళ్ల వయసులో కూడా రాని భయంకరమైన రోగాలు.. ఇప్పుడు 16 ఏళ్ల వయసున్న యువతకే వస్తున్నాయని గుర్తు చేశారు. ఎక్కువ లాభాల కోసం ఆరాటపడి విచ్చలవిడిగా కెమికల్ ఎరువులు వాడడం వల్ల భూమి సర్వనాశనమవుతోందని.. ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలు అడుక్కుతినే పరిస్థితి దీనివల్లే వచ్చిందని హెచ్చరించారు. విపరీతంగా ఎరువులు వాడటం వల్లే పంజాబ్‌లో క్యాన్సర్ రోగుల సంఖ్య ప్రమాదకరంగా పెరిగిపోయిందన్నారు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయంపై రైతు సమ్మేళన కార్యక్రమానికి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయంపై కృషి విజ్ఞాన కేంద్రం చేస్తున్న కృషిని ఆయన ఎంతగానో అభినందించారు. 19 గ్రామాలను సెలెక్ట్ చేసుకొని, 6 వేల మందికి పైగా రైతులను ఎంపిక చేసి.. ప్రస్తుతం పది వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రాబోయే రోజుల్లో దీనిని యాభై వేల ఎకరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకోవడం అభినందనీయమన్నారు.

ఆవులకు ఎక్కువ పాలు ఇవ్వాలని ఇంజెక్షన్లు ఇస్తున్నారని.. దీనివల్ల 10 సంవత్సరాలు పాలు ఇవ్వాల్సిన ఆవు, కేవలం 3 సంవత్సరాలకే క్షీణించిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.గత 20 సంవత్సరాల నుండి నాకు జ్వరం గానీ, ఇతర రోగాలు గానీ లేవు.. కానీ హైదరాబాద్ పాలు తాగి మూడు రోజులు మంచం పట్టాల్సి వచ్చింది" అంటూ మంత్రి బండి సంజయ్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. కెమికల్స్ వాడకం వల్ల రోగాలు తెచ్చుకొని ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని చెప్పారు.

►ALSO READ | రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్ర : కవిత

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి నాలుగు వేల రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తోందని బండి సంజయ్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు రాబోయే రోజుల్లో కోటీశ్వరులు కాబోతున్నారని.. ఆరోగ్యకరమైన దేశ నిర్మాణం జరగాలంటే ప్రకృతి వ్యవసాయమే మూలాధారమన్నారు.

ఈ పద్ధతిలో పండించిన ఆహారం తింటే ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదని.. చివరికి రోగులు లేక డాక్టర్లు కూడా ప్రకృతి వ్యవసాయం చేసే స్థాయికి రావాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలో అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు బండి సంజయ్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు.. ఈ రోజు నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తూ సెల్ఫీలు పంపించిన రైతులందరికీ ప్రత్యేకంగా సన్మానం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.