లిక్కర్ దందాకు నయా ఇన్వెస్టర్స్!.. ఓరుగల్లులో మద్యం బిజినెస్‍పై కొత్తవారి చూపు

లిక్కర్ దందాకు  నయా ఇన్వెస్టర్స్!..  ఓరుగల్లులో మద్యం బిజినెస్‍పై కొత్తవారి చూపు
  • రాష్ట్రంలో మూన్నెళ్ల ముందే కొత్త ఎక్సైజ్‍ పాలసీ గెజిట్‍ విడుదల 
  • వరంగల్‍ 6 జిల్లాల పరిధిలో 294 వైన్‍ షాపులు
  • 2021లో 9,950 అప్లికేషన్లు, 2023లో 16,037 దరఖాస్తులు
  • ఎస్సీ, ఎస్టీ, గౌడ్‍ కోటాలో 5,348 అప్లికేషన్లు

వరంగల్‍, వెలుగు: ఉమ్మడి వరంగల్​ జిల్లాలో లిక్కర్​ బిజినెస్​పై కొత్తవారు ఆసక్తి చూపుతున్నారు. 2017-19 పాలసీలో ఉమ్మడి వరంగల్​ మొత్తం 294 షాపుల కోసం 7,527 దరఖాస్తులు రాగా, 2023 కి ఆ సంఖ్య డబుల్‍దాటి ఏకంగా 16,037 చేరింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎక్సైజ్‍ పాలసీ తీసుకువచ్చే క్రమంలో బుధవారం గెజిట్‍ విడుదల చేయగా, ఓరుగల్లు లిక్కర్‍ వ్యాపారాలపై డిస్కషన్‍ జోరందుకుంది.

ఈసారి మద్యం పాలసీలో లిక్కర్‍ సీసాల్లోనే కాకుండా టెట్రా ప్యాక్‍ రూపంలో రానుంది. దీనికితోడు డ్రాట్‍ బీర్లు, పండ్లతో తయారు చేసిన వైన్‍వంటి 604 కొత్త మద్యం రకాలకు పర్మిషన్లు ఇచ్చిన నేపథ్యంలో లైసెన్స్ అప్లికేషన్‍ ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచినా ఓరుగల్లులో మాత్రం లిక్కర్ దందాపై కొత్త ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు.  

2023లో రికార్డ్ స్థాయిలో అప్లికేషన్లు..

రాష్ట్రంలో రెండేండ్లకోసారి తీసుకొచ్చే లిక్కర్‍ పాలసీలో పాల్గోనేవారి సంఖ్య ఓరుగల్లులో ఏటా పెరుగుతోంది. 2017-19లో వైన్​ షాపుల కోసం 7,527 దరఖాస్తులు ఉండగా, 2019-21 నాటికి 8100, 2021-23లో 9,950 అప్లికేషన్లు వచ్చాయి. 2023-25 నాటికి 16,037 అప్లికేషన్లు రాగా, 2017తో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య 8,510కి పెరిగింది. గత పాలసీలో షాపుల కోసం కొన్ని సామాజికవర్గాలకు రిజర్వేషన్లు కలిపించగా, ఓరుగల్లులో ఎస్సీ కోటాలో 1,504 మంది, ఎస్టీ 1000 మంది, గౌడ సామాజికవర్గం షాపుల కోసం ఏకంగా 2,844 అప్లికేషన్లు వచ్చాయి. 

ఓరుగల్లులో మొత్తం 294 వైన్‍ షాపుల్లో హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని 57వ నంబర్‍ వైన్‍షాపు కోసం ఓపెన్ కోటాలో అత్యధికంగా 182 దరఖాస్తులు రాగా, భీమదేవరపల్లి మండలంలోని 62వ నంబర్‍ ముల్కనూర్‍-2 వైన్స్​ కోసం గౌడ సామాజిక రిజర్వేషన్‍ కోటాలో అత్యల్పంగా 62 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.