బిహార్‎లో రికార్డు పోలింగ్.. రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే హాయ్యెస్ట్ ఓటింగ్ నమోదు

బిహార్‎లో రికార్డు పోలింగ్.. రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే హాయ్యెస్ట్ ఓటింగ్ నమోదు

పాట్నా: బిహార్‎లో మంగళవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో 68.79 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఆ రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే అత్యధికం. రెండో దశలో 122 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. మగధ్, చంపారన్, సీమాంచల్ లాంటి నిర్ణయాత్మక ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లలో 1.75  కోట్ల మంది మహిళలు ఉన్నారు. వీరికోసం 45,399 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఇందులో అత్యధిక కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. 

నవాడా జిల్లా హిసువా నియోజకవర్గంలో అత్యధికంగా 3.67 లక్షల ఓటర్లు ఉన్నారు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు తర్వాత ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లు భారీగా పెంచారు. మొత్తం 4 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. పోలింగ్‌‌ నేపథ్యంలో భారత్–నేపాల్ సరిహద్దును 72 గంటలు మూసివేశారు. మరోవైపు, నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 65.08 శాతం ఓట్లు పోలయ్యాయి. రెండు దశల్లో మొత్తం కలిపి 66.90 శాతం పోలింగ్​జరిగింది. ఇది 2020 ఎన్నికల కంటే 9.6 శాతం ఎక్కువ. 2020లో 57.29 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. రిజల్ట్స్ నవంబర్ 14న వెలువడనున్నాయి.

నిర్ణయాత్మకంగా సీమాంచల్

ఈ అధిక పోలింగ్ ‘యాంటీ-ఇన్‌‌కంబెన్సీ’కి సూచన అని తేజస్వి యాదవ్, ఇండియా బ్లాక్ మిత్రులు అంటున్నారు. ఎన్డీయే నాయకులు ధర్మేంద్ర ప్రధాన్ వంటి వారు అధిక పోలింగ్ బిహార్‎లో ఎటువంటి మార్పును సూచించదని చెప్తున్నారు. మరోవైపు, రెండో దశలో పోలింగ్ జరిగిన సీమాంచల్‌‌లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పూర్నియా, అరారియా, కిషన్‌‌గంజ్, కటిహార్ జిల్లాల్లోని 24 స్థానాల్లో ముస్లిం జనాభా 40% పైగా ఉంది. 

2020లో ఎంఐఎం ఇక్కడ 5 స్థానాలు గెలుచుకుంది. అలాగే, యాదవులు, అతి వెనుకబడిన తరగతులు(ఎంబీసీ) ప్రభావం కూడా ఎక్కువే. ఈసారి ఇక్కడ 1,302 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఎన్డీయే, మహాఘట్​బంధన్​మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పార్టీ ‘ఎక్స్ ఫ్యాక్టర్’గా ఉంది. అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం పార్టీ సీమాంచల్​లో ముస్లిం, దళిత ఓట్లను చీల్చే చాన్స్ ఉంది. హెచ్​ఏఎం, వీఐపీ, ఆర్​ఎల్​ఎం వంటి చిన్న పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి.