ఎల్ నినో ఎఫెక్ట్.. రికార్డు కరెంట్ వాడకం... జూన్ నెలలో అత్యధిక యూసేజ్... ఏకంగా 2540 మిలియన్  యూనిట్లు వాడిన జనం

ఎల్ నినో ఎఫెక్ట్.. రికార్డు కరెంట్ వాడకం... జూన్ నెలలో అత్యధిక యూసేజ్... ఏకంగా 2540 మిలియన్  యూనిట్లు వాడిన జనం
  • 2024, 2025లో ఇంతకన్నా తక్కువే 
  • ఎండల తీవ్రత, ఆలస్యమైన వర్షాలు, ఏసీల వినియోగమే ప్రధాన కారణాలు
  • ఐటీ కారిడార్, డేటా సెంటర్లు, ఈవీలతో మరింత పెరిగిన డిమాండ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్ నెలలో విద్యుత్​ డిమాండ్​ భారీగా పెరిగి సరికొత్త రికార్డు నమోదైంది. జూన్​లో ఎండలు దంచికొట్టడం, ఎల్​నినోతో అంతంత మాత్రంగానే వర్షాలు పడుతుండడంతో ఇండ్లు, వాణిజ్య సంస్థల్లో ఏసీలు, కూలర్ల వాడకం మే నెల లెక్కనే కొనసాగింది. దీంతో ఈ సంవత్సరం జూన్​నెలలో అన్ని రికార్డులను బద్ధలు కొడుతూ.. 2,540 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం నమోదైంది.  

ఈ వినియోగం 2024 జూన్ నెల 2127 మిలియన్ యూనిట్లు కాగా, 2025 జూన్ లో 2,150 మిలియన్ యూనిట్లు మాత్రమే నమోదైంది. కాగా, ఈ ఏడాది జూన్ 3న ఒక్కరోజే  జీహెచ్‌‌ఎంసీ పరిధిలో అసాధారణంగా 4,471 మెగావాట్ల గరిష్ట లోడ్ నమోదైంది. 2024  జూన్ నెల 1న గరిష్టంగా 4046 మెగా వాట్లు, 2025 జూన్ 19న అత్యధికంగా 3635 మెగా వాట్లు మాత్రమే రికార్డయ్యింది.  

ఉక్కపోతతో పెరిగిన కరెంట్​డిమాండ్ ..

సాధారణంగా జూన్ రెండో వారం నుంచి నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసి వాతావరణం చల్లబడేది. కానీ, ఈ ఏడాది వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వర్షాలు ఆలస్యమయ్యాయి. దీంతో విద్యుత్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఎల్‌‌నినో, గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 40  డిగ్రీల వరకు నమోదు కావడంతో పాటు, రాత్రి వేళల్లో సైతం ఉక్కపోత తీవ్రంగా ఉండటంతో నగరవాసులు నిరంతరం ఏసీలు, ఫ్యాన్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. 

హైదరాబాద్ నగర విస్తరణ, ఐటీ కారిడార్‌‌లో కొత్త అపార్ట్‌‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ డేటా సెంటర్లు, షాపింగ్ మాల్స్ వేగంగా పెరుగుతున్నాయి. ప్రతి ఇంట్లో ఏసీలు, కూలర్లు వాడడం సాధారణం కావడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్, ఇండక్షన్ స్టవ్‌‌ల వాడకం కూడా గృహ విద్యుత్ వినియోగాన్ని ఊహించని స్థాయికి పెంచేసింది.

పీక్ అవర్స్‌‌లో గ్రిడ్‌‌పై తీవ్ర ఒత్తిడి..

భారీ విద్యుత్​వినియోగం కారణంగా ప్రస్తుతం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య, రాత్రి 8 నుంచి 11 గంటల మధ్య పీక్ అవర్స్‌‌లో విద్యుత్ గ్రిడ్‌‌పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. వేలాది ఏసీలు, హై-వోల్టేజ్ పరికరాలు ఒకేసారి ఆన్ చేయడం వల్ల లోడ్ పెరిగి లోకల్ ట్రాన్స్‌‌ఫార్మర్లు దెబ్బ తినే పరిస్థితి వచ్చింది. 

దీంతో అలా జరగకుండా విద్యుత్ శాఖ సబ్‌‌స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచింది. ఫీడర్లను అప్‌‌గ్రేడ్ చేసింది. అయినా, జూన్​ముగిసి జూలై వచ్చినా విద్యుత్​వినియోగం మాత్రం తగ్గడం లేదు.