కరోనా సోకినా స్పీడ్‌గా కోలుకుంటున్నరు

కరోనా సోకినా స్పీడ్‌గా  కోలుకుంటున్నరు
  • కరోనా సోకినా నాలుగైదు రోజుల్లోనే డిశ్చార్జ్​ అవుతున్నరు
  • రెండు వారాలుగా దవాఖాన్లలో పెరుగుతున్న పేషెంట్లు
  • ఇతర రోగాలున్న వాళ్లు, ముసలివాళ్లే ఎక్కువ చేరుతున్నరు
  • వ్యాక్సిన్‌‌ తీసుకున్నా రూల్స్‌‌ పాటించాలంటున్న డాక్టర్లు 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. దవాఖాన్లకు వస్తున్న పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. డిసెంబర్‌‌‌‌, జనవరితో పోలిస్తే ఈ నెలలో ఇన్‌‌పేషెంట్ల సంఖ్య మూడింతలు పెరిగింది. అయితే తీవ్రత మాత్రం తక్కువగా ఉంటోంది. హాస్పిటల్‌‌లో చేరిన నాలుగైదు రోజుల్లోనే కోలుకుంటున్నారు. ఇంతకుముందులా ఆక్సిజన్‌‌, ఐసీయూ వార్డుల అవసరం ఉండట్లేదని డాక్టర్లు చెబుతున్నారు. హాస్పిటళ్లలో అడ్మిట్‌‌ అవుతున్న వాళ్లలో కొమార్బిడిటీస్‌‌ ఉన్న వాళ్లు, ముసలివాళ్లే ఎక్కువుంటున్నారని చెప్పారు. హెల్త్ డిపార్ట్‌‌మెంట్ లెక్కల ప్రకారం గత నెల 16 నాటికి మొత్తం కరోనా ఇన్‌‌పేషెంట్ల సంఖ్య 999 ఉండగా ఈ నెల అదే తేదీ నాటికి 1,385 పేషెంట్లు ఉన్నారు. యాక్టివ్ పేషెంట్ల సంఖ్య 1,640 నుంచి 2,100కు పెరిగింది.   
 

వెంటిలేటర్‌‌‌‌పై 417 మంది

రాష్ర్టంలో కరోనా టెస్టులు పెంచారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు 60,527 మందికి టెస్టు చేస్తే 247 మందికి పాజిటివ్‌‌ వచ్చిందని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,01,769కి పెరగ్గా ఇందులో 2,98,009 మంది కోలుకున్నట్టు బులెటిన్‌‌లో పేర్కొన్నారు. 716 మంది హోమ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉన్నారు. 1,385 మంది ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో చికిత్స పొందుతున్నారు. ఇందులో 417 మంది వెంటిలేటర్‌‌‌‌పై.. 655 మంది ఆక్సిజన్‌‌పై ఉన్నారు.

వ్యాక్సిన్ తీసుకున్నా వదలట్లే

వ్యాక్సిన్ తీసుకున్నా కొంత మందికి వైరస్ సోకుతోంది. కామారెడ్డి జిల్లా హాస్పిటల్‌‌లో ఓ డాక్టర్‌‌‌‌ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న 10 రోజుల తర్వాత కరోనా బారినపడ్డారు. ఆయన తల్లిదండ్రులకు వైరస్ సోకడం, తనకు గొంతులో నొప్పి రావడంతో టెస్టు చేయించుకున్నారు.  పాజిటివ్‌‌గా తేలడంతో అందరూ అవాక్కయ్యారు. ఇలాంటి ఘటనలు రాష్ర్టంలో అక్కడక్కడ చూస్తున్నామని, ఇది సాధారణమేనని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెబుతున్నారు. ఏ వ్యాక్సిన్‌‌ కూడా వంద శాతం ప్రొటెక్షన్ ఇవ్వదని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌ డాక్టర్ రాజారావు అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లలోనూ కొంత మందికి వైరస్ సోకొచ్చని, అయితే వీళ్లకు సీరియస్‌‌ లక్షణాలు వచ్చే చాన్స్‌‌ తక్కువగా ఉంటుందని చెప్పారు. వ్యాక్సిన్ అందరూ తీసుకోవాలని.. టీకా తీసుకున్న తరువాత కూడా మాస్క్‌‌, సోషల్ డిస్టెన్స్, కరోనా రూల్స్‌ తప్పకుండా పాటించాలని రాజారావు సూచించారు.

సివియారిటీ పెరగొచ్చు

డిసెంబర్‌‌‌‌, జనవరితో పోలిస్తే ఇన్‌‌పేషెంట్ల సంఖ్య నాలుగింతలు పెరిగింది. నెల రోజుల నుంచి పెరుగుతున్నా రెండు వారాల నుంచి ఎక్కువగా వస్తున్నారు. సివియారిటీ ఎక్కువేం ఉండట్లేదు. జనరల్ ట్రీట్‌‌మెంట్‌‌తో నాలుగైదు రోజుల్లోనే డిశ్చార్జ్ అవుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పలేం.

- డాక్టర్ శ్రీధర్‌‌‌‌, క్రిటికల్ కేర్ వింగ్ హెడ్‌‌, అపోలో హాస్పిటల్స్‌‌, జూబ్లీహిల్స్‌‌