ఉద్యోగాల భర్తీ ఇంకెప్పుడు సారూ!

ఉద్యోగాల భర్తీ ఇంకెప్పుడు సారూ!

వైద్య ఆరోగ్య శాఖలోని ప్రతి విభాగంలోనూ ప్రస్తుతం ఖాళీలే వెక్కిరిస్తున్నాయి. రెండేండ్లుగా ఉద్యోగాల భర్తీ​పై దృష్టి పెట్టని ప్రభుత్వం ఔట్​సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతోనే కాలం వెళ్లదీస్తోంది.

నోటిఫికేషన్లు ఇచ్చినా పెండింగ్​లోనే..
ప్రభుత్వాస్పత్రుల్లోని స్టాఫ్ నర్స్, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌, ఏఎన్‌ఎం, రేడియోగ్రాఫర్‌‌, ఫిజియోథెరపిస్ట్‌ తదితర 4,375 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నవంబర్​ 2017 నుంచి జనవరి 2018 వరకూ నోటిఫికేషన్లు ఇచ్చింది. ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ సిబ్బందికి 30%(65 మార్కులు) వెయిటేజీ ఇచ్చింది. దీనిపై నిరుద్యోగులు కోర్టుకెక్కారు. ఈ కేసు కోర్టులో ఉండగానే, మార్చి 2018లో టీఎస్పీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించింది. ఈ జనవరిలో ఫార్మసిస్ట్‌ మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఇందులో కనీస అర్హత మార్కులు సాధించని వారికి.. వెయిటేజీ మార్కులు కలిపి మెరిట్ జాబితాలో చోటు కల్పించింది. నిబంధనలకు విరుద్ధంగా మెరిట్‌ జాబితా ఉందంటూ నిరుద్యోగ ఫార్మసిస్ట్‌ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఆఫీస్‌ ఎదుట ధర్నా చేశారు. పొరపాటును అంగీకరించిన అధికారులు, మళ్లీ మెరిట్‌ జాబితా ప్రకటిస్తామన్నారు. రెండోసారి ప్రకటించిన మెరిట్ లిస్ట్​లోనూ కనీస అర్హత మార్కులు సాధించనివారికి చోటిచ్చింది. దీనిపై కోర్టులో నిరుద్యోగులు మరో పిటిషన్‌ వేశారు. ఈ కేసులు కోర్టులో ఉండగానే, తమకూ వెయిటేజీ ఇవ్వాలని ఔట్‌ సోర్సింగ్ సిబ్బంది కోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో ఏడాదిన్నరగా ఉద్యోగాల భర్తీ నిలిచిపోయింది. ఈ 4,375పోస్టులతోపాటు నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, మహబూబ్‌నగర్‌‌, నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీలకు మంజూరు చేసిన 2,500 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీ కూడా ఆగిపోయింది. కొలువు వస్తుందన్న నమ్మకంతో ప్రైవేటు ఉద్యోగాలు చేయలేక, పరీక్ష ఫలితాలు వెలువడక మానసిక క్షోభకు గురవుతున్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంట్రాక్ట్ వైపే సర్కారు మొగ్గు
దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో నలుగురి పని ఒక్కరే చేయాల్సి వస్తోంది. మరోవైపు ఖాళీల భర్తీపై శ్రద్ధ పెట్టని ప్రభుత్వం.. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వైపే మొగ్గు చూపుతోంది. వైద్య ఆరోగ్యశాఖలోని దాదాపు అన్ని విభాగాల్లో 10 నుంచి 25 శాతం కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులే ఉన్నారు. డైరెక్టర్‌‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌‌ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 1,357 మంది కాంట్రాక్ట్ ముగియగా, తాజాగా వారికి కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని దవాఖానాల్లో డయాగ్నొస్టిక్​ యంత్రాలను ఆపరేట్‌ చేసే సిబ్బంది లేక నిరుపయోగంగా మారుతున్నాయి. దీంతో ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్లకు వెళుతున్న రోగులు రూ.వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.

 

పోస్టు                        నోటిఫికేషన్‌లో
పేర్కొన్న ఖాళీలు

స్టాఫ్‌ నర్సులు                3,311

ల్యాబ్‌ టెక్నీషియన్‌         325

ఫార్మసిస్ట్‌                        369

ఏఎన్‌ఎం                         150

రేడియోగ్రాఫర్‌‌                 115

ఫిజియోథెరిపిస్ట్‌              105