తెలంగాణ వ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు, వడగాలులు క్రమక్రమంగా పెరుగుతూ రాష్ట్రాన్ని నిప్పుల కొలిమిలా మారుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఈ నిప్పుల వర్షం ఆగేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చరిత్రలోనే మొదటిసారిగా వడగాల్పులపై అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
మే 25న రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో అతి తీవ్రమైన, ఎక్స్ట్రీమ్ వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత ప్రమాదకరమైన వడగాలులు వీయనున్నాయి.
ఇక తీవ్రమైన వడగాల్పుల హెచ్చరికతో మరో 8 జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ అయింది. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
అలాగే.. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం జిల్లాలకు వడగాల్పుల తీవ్రత దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ALSO READ : ములుగులో అర్థరాత్రి రెండు వైన్స్ షాపుల్లో చోరీ..
మరో వైపు ఈరోజు రికార్డు స్థాయిలో 19 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయి. మిగిలిన జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది.
వాతావరణ శాఖ ముఖ్యమైన సూచన చేసింది. ప్రజలెవ్వరూ మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఎక్కువ సమయం ఎండలో గడపకండి. ఈరోజు పగలే కాదు.. రాత్రిళ్లు కూడా వేడి వాతావరణం ఉంటుందని, ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 'వేడి రాత్రులు' ఉంటాయని తెలిపారు.
అయితే ఈ విపరీతమైన వేడి కారణంగా లోకల్ కండిషన్స్ మారి.. సాయంత్రం వేళ ఒక్కసారిగా వాతావరణం చల్లబడే అవకాశం కూడా ఉంది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన వర్షాలు.. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
