
- ఈ రీజియన్‌లో శాంతి భద్రతలకు కృషి చేస్తున్నం
- బార్డర్ ఏరియాలను బలమైన కోటలుగా మారుస్తుం: మోడీ
షిల్లాంగ్/అగర్తల: గత ఎనిమిదేండ్లలో ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ఉన్న అడ్డంకులన్నింటినీ తమ ప్రభుత్వం తొలగించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎవరైనా ఆడితే.. వారికి రెడ్ కార్డు చూపిస్తారు. మైదానం నుంచి బయటికి పంపిస్తారు. అలానే.. నార్త్‌ఈస్ట్‌లో 8 ఏండ్లలో అవినీతి, అశాంతి, రాజకీయ పక్షపాతం తదితర అన్ని అడ్డంకులకు ‘రెడ్ కార్డ్’ ఇచ్చేశాం” అని చెప్పారు. ఈ రీజియన్‌లో గొడవలను పరిష్కరించడం ద్వారా శాంతి భద్రతలకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. గతంలో నార్త్‌ఈస్ట్‌ను విభజించడానికి ప్రయత్నాలు జరిగాయని, ఇప్పుడు తాము ఈ విభజనలను తొలగిస్తున్నామని చెప్పారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో జరుగుతున్న నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ప్రధాని హాజరయ్యారు. తర్వాత ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో జరిగిన సభలో ప్రధాని మాట్లాడారు. ‘‘ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరుగుతున్న రోజే నేను ఫుట్‌బాల్ స్టేడియంలో ఫుట్‌బాల్ అభిమానులతో మాట్లాడుతుండటం యాదృచ్ఛికమే కావచ్చు. అక్కడ (ఖతార్) ఫుట్‌బాల్ పోటీ జరుగుతున్నది.. ఇక్కడ మేం అభివృద్ధిలో పోటీ పడుతున్నం’’ అని వివరించారు. ‘‘ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో విదేశీ టీమ్స్‌కు మనం సపోర్ట్ చేస్తున్నాం. మీకో మాట ఇస్తున్నా.. అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్‌ను మన దేశంలో నిర్వహించే రోజు ఎంతో దూరంలేదు. అప్పుడు మన జెండా పైకెగురుతుంది. ఆ రోజు మన టీమ్‌లో ఉత్సాహం నింపుదాం’’ అని అన్నారు.
అగర్తలలో పర్యటన
షిల్లాంగ్ పర్యటన ముగించుకుని త్రిపుర రాజధాని అగర్తలకు ప్రధాని వెళ్లారు. అక్కడి స్వామి వివేకానంద గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రూ.4,350 కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో కొన్నింటిని ప్రారంభించగా.. మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధానికి దారి పొడవునా విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.
నార్త్‌ఈస్ట్.. అష్ట లక్ష్మి
8 రాష్ట్రాలతో కూడిన నార్త్‌ఈస్ట్.. అష్ట లక్ష్మి అని ప్రధాని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి 8 పిల్లర్లపై పని చేయాలన్నారు. ఆ పిల్లర్లు.. శాంతి, శక్తి, పర్యాటకం, 5జీ కనెక్టివిటీ, సంస్కృతి, ప్రకృతి వ్యవసాయం, క్రీడలు, సామర్థ్యాన్ని
కలిగి ఉండటమని చెప్పారు.
తొలి స్పోర్ట్స్ యూనివర్సిటీ
నార్త్ ఈస్ట్‌లో క్రీడల అభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టి పెడుతున్నదని మోడీ తెలిపారు. దేశంలోనే తొలి నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, 90 మేజర్ స్పోర్ట్స్ ప్రాజెక్టులు ఈ రీజియన్‌లో కొనసాగుతున్నాయని వెల్లడించారు. నార్త్‌ఈస్ట్‌లో ఎయిర్ కనెక్టివిటీ పెంచామని మోడీ అన్నారు. 2014 ముందు దాకా వారానికి 900 విమానాలు మాత్రమే రాకపోకలు సాగించేవని, ప్రస్తుతం 1,900 దాకా ఫ్లైట్లు అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు. నార్త్‌ఈస్ట్‌లో 6 వేల మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం కేంద్రం రూ.5 వేల కోట్లను ఖర్చు చేస్తున్నదని తెలిపారు.
నార్త్ ఈస్ట్ ఏరియాలు..మన ప్రధాన పిల్లర్లు
‘‘మా వరకు.. నార్త్ ఈస్ట్‌లోని బార్డర్ ఏరియాలు కేవలం చివరి మైళ్లు మాత్రమే కాదు. మన ప్రధాన పిల్లర్లు. బార్డర్ వెంబడి ఉన్న ఏరియాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ‘బార్డర్ ఏరియాను డెవలప్ చేస్తే.. శత్రు దేశం లాభపడుతుంది’ అని గత ప్రభుత్వాలు భావించాయి. కానీ మా ప్రభుత్వం.. బార్డర్ ఏరియాలను మన బలమైన కోటలుగా మలుస్తున్నది” అని ప్రధాని వివరించారు. పర్యటనలో మేఘాలయలో 2,450 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా, 8 ఈశాన్య రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు హాజరయ్యారు.