
ముషీరాబాద్, వెలుగు: మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఉప కోటా కల్పించకపోతే ఎర్రకోటను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ బీసీలను రాజకీయంగా తడిగుడ్డతో గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఉప కోటా కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం, బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ దోమలగూడలోని కేంద్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు.
ఈ దీక్షకు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీఆర్ఎస్ నాయకుడు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, సభ్యులు ఉపేందర్, ధర్మసమాజ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, సీపీఐ నాయకులు నరసింహ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటే.. బీసీ మహిళలకు ఉప కోటాపై కేంద్రం దిగి వచ్చేదని అన్నారు. త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యతిరేక పార్టీలను ఓడిస్తామని హెచ్చరించారు.
పొన్నాల లక్ష్మయ్య
మాట్లాడుతూ.. బీసీలకు ఏం చేయని మోదీ ప్రభుత్వాన్ని బీసీలు కలిసికట్టుగా ఏర్పడి గద్దె దింపాలని పిలుపునిచ్చారు. మధుసూదనాచారి మాట్లాడుతూ.. తాను మొదటి స్పీకర్గా బీసీలకు రాజకీయాల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే పట్టించుకోలేదన్నారు. దేశంలో 45 కోట్ల మంది మహిళలకు బీసీ కోటా పెట్టకపోవడం అన్యాయమని విశారదన్ మహారాజ్ పేర్కొన్నారు.