Bigg Boss 19: బిగ్ బాస్ 19లోకి అతి పిన్న వయస్కురాలు.. అష్ణూర్ కౌర్ టాలెంట్ మాములుగా లేదుగా!

Bigg Boss 19: బిగ్ బాస్ 19లోకి అతి పిన్న వయస్కురాలు.. అష్ణూర్ కౌర్ టాలెంట్ మాములుగా లేదుగా!

'బిగ్ బాస్ 19 సీజన్' ( హిందీ ) అట్టహాసంగా ఆగస్టు 24న ప్రారంభమైంది.  ఈ రియాలిటీ షోకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  మొత్తం 16 మంది కంటెస్టెంట్లను ఆయన హౌస్ లోకి పంపించారు. అయితే 'బిగ్ బాస్ 19' హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్లలో ఒకరు అష్ణూర్ కౌర్. ఈ సీజన్లో అందరికంటే చిన్న వయస్కురాలైన కంటెస్టెంట్‌గా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పుడు ఈమె పేరు  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

చిన్న వయసులోనే నటిగా..
 సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా మొదలైన ఈ రియాలిటీ షోలో అష్ణూర్ కౌర్ ప్రయాణం  అందరి దృష్టిని ఆకర్షించింది. ఝాన్సీ కి రాణి, సాథ్ నిభానా సాథియా, యే రిష్తా క్యా కెహ్లాతా హై, పటియాలా బేబ్స్, సుమన్ ఇండోరి వంటి టీవీ షోలలో తన నటనతో ఆమె అపారమైన కీర్తిని సంపాదించుకున్నారు. కేవలం ఐదేళ్ల వయసులోనే 2009లో ఝాన్సీ కి రాణి సీరియల్‌తో అష్ణూర్ తన నట జీవితాన్ని ప్రారంభించారు. ఆమె సహజమైన నటన, స్క్రీన్ ప్రెసెన్స్ భారతీయ టెలివిజన్‌లో ఆమెను ఒక ప్రముఖ నటిగా నిలబెట్టాయి. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌లో చిన్న నాయరా పాత్రతో ఆమె ఇంటింటికీ తెలిసిన పేరుగా మారారు. వయసుతో పాటు ఆమె పటియాలా బేబ్స్ వంటి షోలలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ షోలో ఆమె పోషించిన మినీ పాత్రకు మంచి పేరు వచ్చింది.

అద్భుతమైన విద్యా ప్రతిభ
అష్ణూర్ కౌర్ ప్రతిభ కేవలం నటనకు మాత్రమే పరిమితం కాదు. ఆమె విద్యాపరంగా కూడా అద్భుతమైన విజయాలు సాధించారు. తన సోషల్ మీడియాలో ఆమె తెలిపిన ప్రకారం, తన పదో తరగతిలో 93%, ఇండర్ లో 94% మార్కులను సాధించారు. అష్ణూర్ మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు.

►ALSO READ | సౌత్ వాళ్లకు అదే పిచ్చి.. ఓపెన్ అయిన బాలీవుడ్ బ్యూటీ!

19 ఏళ్లకే డ్రీమ్ హౌస్ కొనుగోలు..
అష్ణూర్ తన 19 ఏళ్ల వయసులోనే ముంబైలో తన కలల ఇంటిని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆమె తన ఇంట్లో జరిగిన పూజ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాకుండా, ఒక విలాసవంతమైన కారును కూడా కొన్నారు. నేను చిన్న వయసులోనే ఇవన్నీ సాధించానని చాలా మంది అనుకోవచ్చు. కానీ, పదేళ్లుగా నేను చాలా కష్టపడ్డాను. నా బోర్డు పరీక్షలు రాస్తూ, షూటింగ్ లలో పాల్గొనడం అంత తేలికైన విషయం కాదు అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

సల్మాన్ ఖాన్ ఎదుట 'బిగ్ బాస్ 19'లో అతి పిన్న వయస్కురాలైన విజేతగా నిలబడాలనే తన లక్ష్యాన్ని ధీమాగా చెప్పింది అష్ణూర్ కౌర్. ఆమె ఆత్మవిశ్వాసం, స్పష్టతను సల్మాన్ కూడా ప్రశంసించారు.  మరి ఈ బిగ్ బాస్ 19లో  అష్ణూర్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి మరి.