
- పేపర్1కు 99,958.. పేపర్ 2కు 1.86 లక్షల మంది అప్లై
హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు 2,86,386 అప్లికేషన్లు వచ్చాయి. పేపర్ 1కు 99,958 మంది, పేపర్ 2కు 1,86,428 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోలిస్తే అప్లికేషన్లు స్వల్పంగా తగ్గాయి. శనివారం అర్ధరాత్రితో టెట్ దరఖాస్తు గడువు ముగిసింది. దరఖాస్తుల వివరాలను టెట్ కన్వీనర్ రాధారెడ్డి ప్రకటించారు. గతేడాది నిర్వహించిన టెట్‌కు 2,91,058 అప్లికేషన్లు రాగా.. గతంతో పోలిస్తే ఈసారి 4,672 దరఖాస్తులు తగ్గాయి.
టీచర్ల ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి కావడంతో ఈ ఏడాది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పేపర్ 2కు ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. పేపర్1కు అత్యధికంగా ఆదిలాబాద్ లో 7,163, వికారాబాద్ లో 5,879 అప్లికేషన్లు సబ్మిట్ అయ్యాయి. అత్యల్పంగా భూపాలపల్లిలో 771, జనగామలో 795 వచ్చాయి. పేపర్ 2కు మ్యాథ్స్ అండ్ సైన్స్ కేటగిరిలో 99,974, సోషల్ స్టడీస్ లో 86,454 దరఖాస్తులు వచ్చాయి.
మ్యాథ్స్ కేటగిరిలో అత్యధికంగా నల్లగొండలో 7,168, ఖమ్మంలో 5,455 అప్లికేషన్లు రాగా, అతి తక్కువగా భూపాపల్లిలో 935 దరఖాస్తులొచ్చాయి. సోషల్ స్టడీస్ కేటగిరిలో అత్యధికంగా జనగామలో 5,942, అత్యల్పంగా మెదక్ లో 686 అప్లికేషన్లు సబ్మిట్ అయ్యాయి. పేపర్ 2కు ఓవరాల్‌గా అత్యధికంగా నల్లగొండలో 9,162, నిజామాబాద్ లో 9,045 దరఖాస్తులు వచ్చాయి.