హైదరాబాద్, వెలుగు: కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ శనివారంతో పూర్తయింది. ఈ సందర్భంగా వచ్చిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ముసాయిదా బిల్లులో మార్పులు చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల అభిప్రాయాలు, సలహాలు, సూచనలన్నింటినీ ఒక దగ్గర పొందుపరిచి పరిశీలించాలని, అందులో ప్రజలకు ఏవి అవసరమో గుర్తించి.. ఆ అంశాలను కొత్త చట్టంలో పొందుపరచాలని సూచించారు. వీలైనంత త్వరగా ముసాయిదాలో మార్పులు, చేర్పులు చేయాలన్నారు.
ఈ మేరకు శనివారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని, మారుతున్న కాలానికి, పరిస్థితులకు తగినట్టుగా రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ముసాయిదాపై ఆగస్టు 2న శాసనసభలో చర్చించి అదే రోజు హైదరాబాద్ లోని భూ పరిపాలన ప్రధాన కార్యాలయ పబ్లిక్ డొమైన్ లో పెట్టారు.
కలెక్టర్ల ఆధ్వర్యంలో వర్క్ షాప్ లు కూడా నిర్వహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన వర్క్ షాప్ లలో వచ్చిన సూచనలను ఒక నివేదిక రూపంలో కలెక్టర్లు వెంటనే సీసీఏల్ఏ ఆఫీస్‌కు పంపించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ధరణి లాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండేలా మేధావులు, నిపుణులు, రైతులు, సామాన్య ప్రజలనుంచి కూడా అభిప్రాయాలను స్వీకరించామని.. అది కూడా ప్రత్యేక నివేదిక తయారు చేసి పంపాలని మంత్రి ఆదేశించారు.
అవినీతి రహితంగా కొత్త చట్టం
రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో పెద్ద ఎత్తున సలహాలు, సూచనలు వచ్చాయని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. లిఖిత పూర్వకంగా, అలాగే ఈ మెయిల్ ద్వారా కూడా వచ్చాయన్నారు. అమలు చేసేవారికి అవగాహన ఉండేలా రైతులకు, సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవినీతి రహితంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నామని మంత్రి పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో అత్యంత రహస్యంగా ఉన్న ధరణిని తమ ప్రభుత్వం ఒక పబ్లిక్ డాక్యుమెంట్ గా అందరికీ అందుబాటులో ఉంచబోతోందని ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత భూ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తే, గత పాలకుల తొందరపాటు నిర్ణయాలతో అది నెరవేరకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నం అయ్యాయని విమర్శించారు. తప్పుల తడకలా ఉన్న ధరణి వల్ల రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది రైతులు ధరణి బాధితులుగా మారారని మంత్రి స్పష్టం చేశారు.