ప్లాస్టిక్ బ్యాన్: బేకరీలో కవర్ ఇవ్వలేదని.. ఇటుకతో కొట్టి చంపిన యువకుడు

ప్లాస్టిక్ బ్యాన్: బేకరీలో కవర్ ఇవ్వలేదని.. ఇటుకతో కొట్టి చంపిన యువకుడు

ఢిల్లీ: ప్లాస్టిక్ బ్యాన్ ఉంది. కవర్లు లేవు. ఇవ్వలేం అని చెప్పిన పాపానికి ఓ బేకరీ వర్కర్ ని ఇటుకతో కొట్టి చంపాడో యువకుడు. ఈశాన్య ఢిల్లీలోని బేకరీలో ఈ దారుణం జరిగింది.

దయాల్పూర్ ప్రాంతంలోని ఓ బేకరీలో 45 ఏళ్ల ఖలీల్ అహ్మద్ పని చేస్తున్నాడు. ప్లాస్టిక్ బ్యాన్ కారణంగా ఆ బేకరీలో ప్లాస్టిక్ కవర్లు ఇవ్వడం ఆపేశారు. అయితే అక్కడికి వచ్చిన ఫైజాన్ ఖాన్ (24) అనే యువకుడు తాను డబ్బులిచ్చి వస్తువు కొంటున్నప్పుడు కవర్ ఎందుకివ్వరంటూ గొడవకు దిగాడు. ప్లాస్టిక్ బ్యాన్ ఉందని, వాడకూడదని చెప్పినా వినిపించుకోలేదు. తనకు కవర్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టాడు. మాటామాట పెరిగి ఖలీల్ పై దాడికి దిగాడు. షాపు బయటపడి ఉన్న ఇటుక రాయి తీసుకుని అతడి తలపై కొట్టాడు ఫైజాన్ ఖాన్. దీంతో రక్తం కారుతూ ఖలీల్ కింద పడిపోవడంతో ఫైజాన్ అక్కడి నుంచి పరారయ్యాడు.

తీవ్రంగా గాయపడిన ఖలీల్ అహ్మద్ ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణం వదిలాడు. దీని కేసు నమోదు చేసిన పోలీసులు ఫైజాన్ కోసం గాలిస్తున్నారు. అతడి పరారీలో ఉన్నాడని, పట్టుకుని శిక్ష పడేలా చేస్తామని చెప్పారు పోలీసులు.