
- ప్రజలకు ఆమోదయోగ్యంగా అలైన్‌మెంట్ ఉండాలి
- సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఇచ్చిన భూములు కబ్జా కాకుండా కాపాడాలి
- బడ్జెట్‌లో ఆర్అండ్‌బీకి ప్రయారిటీ ఇస్తామని వెల్లడి
- రూ.15 వేల కోట్లు కేటాయించాలని ఆఫీసర్ల ప్రపోజల్స్
- ఆర్ అండ్ బీ, రైల్వే, సినిమాటోగ్రఫీపై మంత్రులు వెంకట్‌రెడ్డి, భట్టి రివ్యూ
హైదరాబాద్, వెలుగు: భవిష్యత్తు తరాల అవసరాలకు అనుగుణంగా ఆర్ఆర్ఆర్ (రీజనల్ రింగ్ రోడ్డు) అలైన్‌మెంట్ ఉండాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలకు జవాబుదారీగా, పారదర్శకంగా, క్రమ పద్ధతిలో ఆలైన్‌మెంట్ రూపొందించాలని అధికారులకు సూచించారు. శనివారం సెక్రటేరియెట్‌లో 2024 – 25 బడ్జెట్ మీటింట్‌లో భాగంగా ఆర్ అండ్ బీ, రైల్వే, సినిమాటోగ్రఫీ బడ్జెట్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి రివ్యూ చేశారు. బడ్జెట్‌లో ఆర్అండ్‌బీకి ప్రయారిటీ ఇచ్చి నిధులు కేటాయిస్తామని భట్టి తెలిపారు.
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణాల గురించి మంత్రులు అడిగిన ప్రశ్నలకు అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, నల్గొండ, హైదరాబాద్‌లో కలెక్టరేట్ల నిర్మాణాలు చేపట్టేందుకు, రాష్ట్రంలో ఆర్వోబీలు, ఆర్ యూబీలు, వీయూబీ బ్రిడ్జ్ ల నిర్మాణానికి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు కేటాయించాలని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ నెట్ వర్క్ పెంచేందుకు అవసరమైన ఫండ్స్ ఇవ్వాలని ఆఫీసర్లు చేసిన ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఆర్ అండ్ బీకి మొత్తం రూ.15 వేల కోట్లు కేటాయించాలని కోరుతూ అధికారులు ప్రపోజల్స్ అందజేశారు. గత ప్రభుత్వంలో డిపార్ట్‌మెంట్‌కు నిధులు తక్కువగా కేటాయించారని, కేటాయించినవి సైతం విడుదల చేయలేదని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
కాంట్రాక్టర్లకు రూ.750 కోట్ల బకాయిలు: వెంకట్‌రెడ్డి
రాష్ట్రంలో సీఐఆర్ఎఫ్ కింద చేపట్టే నిర్మాణాలకు భూసేకరణ నిధులకు ఇబ్బందులు రాకుండా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేయగా భట్టి అంగీకరించారు. చేప ప్రసాదం పంపిణీ, బోనాల జాతర, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల ఏర్పాటుకు తాత్కాలిక అవసరాల కోసం కొంత బడ్జెట్ అవసరముంటుందని, అందుకు సరిపడా నిధులు కేటాయించాలని కోమటిరెడ్డి కోరారు. గత ప్రభుత్వం కేటాయింపులు పేపర్లలో చూపించి, చెల్లింపులు చేయని కారణంగా చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పదిసార్లు టెండర్లు పిలిచినా పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఉందని అన్నారు. కాంట్రాక్టర్లకు సుమారు రూ.750 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిపారు.
భూములు కాపాడండి
సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూములను కాపాడాలని అధికారులను భట్టి ఆదేశించారు. ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న భూములు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో సినిమా సెలబ్రిటీలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నంది అవార్డులపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌పై కమిటీ రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయని, వాటిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుందామని అధికారులకు కోమటిరెడ్డి తెలిపారు.
యాదాద్రి మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణంపై రివ్యూ
యాదాద్రి జిల్లాలోని రాయగిరి వద్ద నిర్మిస్తున్న మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం కోసం 10 ఎకరాల భూకేటాయింపుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఒప్పించి తొలి సంతకం చేయించానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్‌తో సెక్రటేరియట్‌లో మంత్రి రివ్యూ చేపట్టారు.
దీనికి సంబంధించిన డిజైన్లను పరిశీలించారు. అత్యాధునిక వసతులతో కూడిన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్రం నుంచి నిధులను సమీకరించేందుకు రెండు మూడు రోజుల్లో డీపీఆర్ ను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ తో తాను మాట్లాడుతానని, స్టేడియం నిర్మాణానికి ఖేలో ఇండియా పథకంలో భాగంగా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు.