‘ఆర్ఆర్ఆర్’కు ఓకే చెప్తలేరు

 ‘ఆర్ఆర్ఆర్’కు ఓకే చెప్తలేరు
  • రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుపై కేంద్రం వెనకడుగు
  • భూసేకరణ వ్యయం 50 శాతం భరిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం
  • సగం ప్రాజెక్టుకే ఆమోదం తెలిపిన కేంద్రం
  • మిగతా సగంపై సందేహాలు..క్లారిటీ ఇచ్చిన రాష్ర్టం
  • అయినా.. ముందుకు కదలని ప్రాజెక్టు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనపడుతున్నాయి. సగం ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. మిగతా సగం విషయంలో మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చి ఏడు నెలలవుతున్నా.. కేంద్రం నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్)ను కేంద్ర రవాణా శాఖకు ఇచ్చినా ఆమోదం తెలపలేదు. 2016లో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్.. అప్పటి నుంచి ఇప్పటి దాకా వీలు చిక్కినప్పుడల్లా ప్రాజెక్టును ఆమోదించాలని కేంద్రాన్ని కోరుతున్నారు. కానీ కేంద్రం ఆ ఊసే ఎత్తడం లేదు.

ఖర్చు పెరుగుతుందనేనా..

ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ ప్రాజెక్టు అంత ఆమోదయోగ్యం కాదని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కిలోమీటరుకు రూ.35 కోట్ల నుంచి 40 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంటున్నారు. ముందుగా ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే భూసేకరణ పూర్తయి, ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయ్యే సరికి రూ.14 వేల కోట్లకు చేరుకుంటుందంటున్నారు. భూసేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా.. ప్రాజెక్టు నిర్మాణంలో  విద్యుత్, తాగునీటి కాలువలు, రైల్వే ట్రాక్ ల దగ్గర పనుల సమయంలో అయ్యే వ్యయంలోనూ సగం భరించాలని కేంద్రం అడిగినట్లు తెలుస్తోంది. డీపీఆర్ లో మార్పులు చేయాలని సూచించినట్లు సమాచారం. మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపినా పరిస్థితి మాత్రం మారలేదు.

బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సఖ్యత లోపమా?

రాజకీయ కారణాల వల్లే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుతోపాటు ఇతర పనులు ఆమోదం పొందడం లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి లోక్ సభ ఎన్నికలకు ముందు వరకు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సఖ్యత ఉన్నా.. తర్వాత విభేదాలొచ్చాయి. రెండోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారానికి కేసీఆర్ వెళ్లకపోవటం, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించకపోవటం, పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం లేకపోవటం వంటి కారణాల వల్ల ప్రాజెక్టుకు ఆమోదం దక్కట్లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రాజెక్టు ప్లాన్ ఇదీ..

మొత్తం 338 కిలోమీటర్ల రహదారిని, 8 వరుసలుగా, రూ.8 వేల కోట్ల వ్యయంతో వరల్డ్ క్లాస్ ఎక్స్ ప్రెస్ హైవేగా  నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి నుంచి ప్రారంభమై -నర్సాపూర్– తుఫ్రాన్– గజ్వేల్– జగదేవ్ పూర్ – భువనగిరి–చౌటుప్పల్ వరకు 152 కిలోమీటర్లు ఒక ప్రాజెక్టుగా, చౌటుప్పల్ – మాల్ – కడ్తాల్ – షాద్ నగర్ – చేవెళ్ల – కంది వరకు 186 కిలోమీటర్లు మరో ప్రాజెక్టుగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు వ్యయంలో రూ.2,500 కోట్ల వరకు భూసేకరణకు ఖర్చు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. తొలి దశలో 152 కిలోమీటర్ల ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. మిగతా ప్రాజెక్టుపై పలు సందేహాలను, అనుమానాలను వ్యక్తం చేసింది. దీంతో పూర్తి వివరాలతో కేంద్ర రవాణా శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది.

ఎలాంటి వివక్ష లేదు

రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టుల మంజూరు, ఆమోదం విషయంలో ఎలాంటి వివక్ష లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కు, ఇతర విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయటం లేదు. కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు కావట్లేదు.

‑ రాకేశ్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి