రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు ఆగింది!

రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు ఆగింది!

ఆర్థికంగా గిట్టుబాటు కాదని తేల్చిన కేంద్రం
ఆశలు వదులుకున్న ఆర్ అండ్‌‌ బీ అధికారులు
మూడేళ్లుగా ట్రిపుల్‌‌ ఆర్‌‌ చుట్టే రియల్‌‌ వ్యాపారం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై అందరి ఆసక్తి

హైదరాబాద్‌‌, వెలుగురాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌‌ చుట్టూ 338 కిలోమీటర్ల పొడవునా నిర్మించాలనుకున్న రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు (ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌)కు బ్రేక్‌‌ పడింది. ఇది ఆర్థికంగా భారమని భావించి కేంద్ర రోడ్డు రవాణాశాఖ పక్కన పెట్టడంలో డీపీఆర్‌‌ దశలోనే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పటికైతే ట్రిపుల్‌‌ ఆర్‌‌ను మర్చిపోవాల్సిందేనని ఆర్‌‌అండ్‌‌బీకి చెందిన ఓ ఉన్నతాధికారి కామెంట్‌‌ చేయడం చూస్తుంటే దీనిపై ప్రభుత్వానికి కూడా ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ‘రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుపై ఇక ఆశల్లేవు. కేంద్రం 338 కిలోమీటర్లలో 152 కిలోమీటర్ల తొలి దశను జాతీయ రహదారిగా గుర్తించి నంబర్ మాత్రమే ఇచ్చింది. ప్రాజెక్టు మంజూరు చేయలేదు. రెండో దశకు నంబర్ కూడా ఇవ్వలేదు. ప్రాజెక్టు గిట్టుబాటు కాదని కేంద్రం చెప్పింది. ఇప్పటికైతే ఇది ఆగిపోయినట్టే’ అని ఆయన వెల్లడించారు. ట్రిపుల్‌‌ ఆర్‌‌ వస్తుందనే ఆశతో మూడేళ్లుగా ప్రతిపాదిత రోడ్డు పరిధిలో రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారం జోరుగా సాగింది. వ్యాపారులు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు వందలాది ఎకరాలు కొనిపెట్టుకున్నారు. తాజా నిర్ణయంతో సిటీ వెలుపల రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారం అయోమయంలో పడనుంది.అయితే కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

పక్కన పెట్టక తప్పదా?

338 కిలోమీటర్ల రీజినల్‌ రింగ్‌ రోడ్డు కోసం భూసేకరణ, నిర్మాణ వ్యయం కలిపి సుమారు రూ.15 వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 80 శాతం భూసేకరణకే ఖర్చవుతుందని డీపీఆర్​ సిద్ధం చేశారు. అందుకు అవసరమైన రూ.9 వేల కోట్లలో 50 శాతం భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ఇప్పుడు మొత్తానికే  కేంద్రం నో చెప్పడంతో తాత్కాలికంగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టడం తప్పా మరో ఆప్షన్‌ లేనట్టు తెలుస్తోంది.

కేంద్రం ఆమోదముద్ర వేయకముందే..

హైదరాబాద్‌ చుట్టూ ఇప్పటికే ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఉంది. దీనికి వెలుపల సిటీకీ 50, 60 కిలోమీటర్ల దూరంలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించాలని 2016లో స్టేట్‌ గవర్నమెంట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 338 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 15 వేల కోట్లకుపైగా ఖర్చయ్యే పరిస్థితి ఉండడంతో ప్రాజెక్టును రెండు ఫేజ్​లుగా విభజించారు. ఈ  ప్రాజెక్టును ఆమోదించి, జాతీయ రహదారిగా గుర్తించి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2018 డిసెంబర్‌లో సంగారెడ్డి, నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, భువనగిరి, చౌటుప్పల్‌ వరకు ఫస్ట్‌ ఫేజ్​లో నిర్మించే 152 కిలోమీటర్ల ప్రాజెక్టును జాతీయ రహదారిగా గుర్తిస్తూ నంబర్ కేటాయించింది. కానీ దీనికి ఆమోద ముద్ర వేయలేదని అధికారులు చెబుతున్నారు. ఇక సెకండ్‌ ఫేజ్‌లో చౌటుప్పల్‌ నుంచి షాద్‌నగర్‌ మీదుగా కంది వరకు నిర్మించే 186 కిలోమీటర్ల రోడ్డుపై పలు అనుమానాలు కేంద్రం లేవనెత్తింది. వాటికి సమాధానాలిస్తూ సమగ్ర నివేదిక అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర అనుమానాలకు సమాధానాలిస్తూ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు నివేదిక ఇచ్చినా కేంద్రం వాటిని ఆమోదించలేదు. ఇదిలాఉంటే ఈ ప్రాజెక్టు పూర్తయి 30 ఏళ్లపాటు టోల్ వసూలు చేసినా ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు తిరిగి రాదని స్వయంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర రవాణా శాఖ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.

కోట్ల బిజినెస్‌‌ నడిచింది..

రాష్ట్రం డీపీఆర్‌‌ సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించినప్పటి నుంచి ట్రిపుల్‌‌ ఆర్‌‌ పేరిట వందల కోట్ల రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారం నడిచింది. ట్రిపుల్‌‌ ఆర్‌‌ లోపల చిన్నచిన్న టౌన్స్‌‌ను ఆనుకుని ఉన్న భూములకు రెక్కలొచ్చాయి. కొన్ని ఏరియాల్లో రూ.15 లక్షలకు మించని ఎకరం భూమి రూ.కోటికిపైగా ధర పలికింది. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌‌చెరు, అమీన్‌‌పూర్‌‌, నర్సాపూర్‌‌, తూప్రాన్‌‌, ప్రజ్ఞాపూర్‌‌, జగదేవ్‌‌పూర్‌‌, చౌటుప్పల్‌‌, గజ్వేల్‌‌ను ఆనుకుని ఉన్న రాజీవ్‌‌ రహదారి,  వరంగల్‌‌ – హైదరాబాద్‌‌ జాతీయ రహదారిలో ఉన్న భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌‌ పరిసరాల్లోనూ రియల్‌‌ ఎస్టేట్‌‌కు రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు అనూహ్యంగా బూస్టప్‌‌ ఇచ్చింది.

ప్రతిపాదిత రీజినల్ రింగ్‌‌ రోడ్డు స్వరూపం

హైవే పొడవు : 338 కిలోమీటర్లు, ఆరు లైన్లు
ఫస్ట్‌‌ ఫేజ్ : 152 కిలోమీటర్లు (తూప్రాన్‌‌ – గజ్వేల్‌‌‌‌- జగదేవ్‌‌పూర్‌‌ -భువనగిరి – చౌటుప్పల్)
సెకండ్‌‌ ఫేజ్​ : 186 కిలోమీటర్లు (చౌటుప్పల్‌‌ – యాచారం – కడ్తాల్‌‌ – షాద్‌‌ నగర్‌‌ – చేవెళ్ల – శంకర్‌‌పల్లి – కంది)
కవరయ్యే జిల్లాలు: 5,  నియోజకవర్గాలు : 9
మొత్తం ప్రాజెక్టు వ్యయం : రూ.15 వేల కోట్లు
కావాల్సిన భూమి : 11 వేల ఎకరాలు
భూసేకరణకు : రూ.9  వేల కోట్లు
ట్రిపుల్‌‌ ఆర్‌‌తో కలిసే జాతీయ రహదారులు: ఎన్‌‌హెచ్‌‌ – 65, ఎన్‌‌హెచ్‌‌ – 44, ఎన్‌‌హెచ్‌‌ – 163, ఎన్‌‌హెచ్‌‌ – 765

మరిన్ని వార్తల కోసం