విద్యాశాఖకు..ఇన్​చార్జిలే దిక్కా

విద్యాశాఖకు..ఇన్​చార్జిలే దిక్కా
  • రెగ్యులర్​ డీఈఓ, ఎంఈఓల నియామకం ఇంకెప్పుడు?
  • జిల్లాలోని ప్రభుత్వ బడులను వేధిస్తున్న టీచర్ల కొరత
  • స్టూడెంట్ల సంఖ్య పెరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం
  •  మూడేండ్లుగా ‘పది’ ఫలితాల్లో 29 స్థానానికి పరిమితం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రెగ్యులర్​ డీఈఓ, ఎంఈఓ లను నియమించకపోవడంతో ప్రభుత్వ బడులు అధ్వానంగా మారుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్​ అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. డీఈఓ సహా  విద్యాశాఖలోని కీలక విభాగాలకు ఇన్​చార్జులే దిక్కుగా మారారు. దీనికితోడు జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లను టీచర్ల కొరత వెంటాడుతోంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ  బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామని జిల్లా ఉన్నతాధికారులు, అధికార పార్టీ గొప్పలు చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అటు పర్యవేక్షించే అధికారులు లేక.. ఇటు స్కూళ్లలో సరిపడా టీచర్లు లేక స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్​ అందడం లేదు. 

ఖమ్మం డీఈఓనే ఇక్కడ కూడా..

ప్రస్తుతం ఖమ్మం డీఈఓగా ఉన్న సోమశేఖర శర్మనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నారు. డీఈఓ తర్వాత స్థాయిలో కీలకమైన డిప్యూటీ డీఈఓతోపాటు ఏడీ, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. కొన్నేండ్లుగా డిప్యూటీ డీఈఓ పోస్టును ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. ఇక మండల స్థాయిలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన ఎంఈఓలు మొత్తానికే లేరు. జిల్లాలోని 21 మండలాలకు స్కూల్ హెచ్ఎంలే ఎంఈఓలుగా ఇన్​చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొందరు హెచ్ఎంలు రెండు, మూడు మండలాలకు ఇన్​చార్జి​ ఎంఈఓగా పనిచేస్తున్నారు. ఓ వైపు హెచ్ఎంగా తమ స్కూల్​బాధ్యతలు చూసుకుంటూనే 50 – 60 కిలోమీటర్ల దూరంలో ఇతర స్కూళ్ల బాధ్యతలు చూసుకోవడం కష్టంగా ఉంటోందని టీచర్లు వాపోతున్నారు. జిల్లాలోని ముఖ్యమైన పోస్టులతోపాటు టీచర్ల పోస్టులు, గెజిటెడ్ పీజీ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్, ఎస్ జీటీ, పండిట్స్ ఇలా దాదాపు 70కు పైగా ఖాళీలు ఉన్నాయి. దాదాపు 250కి పైగా స్కూళ్లు సింగిల్ టీచర్లతోనే నడుస్తున్నాయి.

అట్టడుగుకు పడిపోయినా..

సర్కార్ బడుల్లో స్టూడెంట్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల బడిబాట కార్యక్రమాన్ని  నిర్వహించింది. ఇదే టైంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో స్థానిక బడుల్లో కార్పొరేట్​స్థాయి బోధన అందిస్తున్నామని అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లీడర్లు ఉపన్యాసాలు గుప్పించారు. కానీ జిల్లా విద్యాశాఖలోని ఖాళీలను మాత్రం భర్తీ చేయడం లేదు. దీంతో మూడేండ్లేగా పదో తరగతి ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 29వ స్థానానికి పరిమితం అవుతోంది.

స్టూడెంట్స్​ పెరిగారు కానీ..

సింగిల్​ టీచర్లతో కొనసాగుతున్న ప్రభుత్వ బడుల్లో ఈ ఏడాది స్టూడెంట్లు పెరిగారు. ఇల్లెందు మండలంలోని జేబీఎస్ ప్రైమరీ స్కూల్​లో దాదాపు 60 మందికి పైగా స్టూడెంట్స్​ఉన్నారు. కానీ ఇక్కడ టీచర్ ఒక్కరే ఉండడంతో విద్యాబోధన కష్టంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి సరిపడా టీచర్లను నియమించాలని పేరెంట్స్​ కోరుతున్నారు. ఇలాంటి స్కూళ్లు జిల్లా వ్యాప్తంగా చాలానే ఉన్నాయి. స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేకపోతే ఆ ప్రభావం పిల్లల చదువుపై పడుతోందని విద్యార్థి సంఘాల నేతలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదు. జిల్లాలో ఒక్క టీచర్ కూడా లేని స్కూళ్లు 10 ఉన్నాయి. 

వీటిలో డిప్యుటేషన్లపై వచ్చిన టీచర్లే బోధిస్తున్నారు. గతంలో ఖాళీలు ఉన్నచోట విద్యావలంటీర్లను నియమించేవారు. రెండేండ్లుగా విద్యా వలంటీర్ల నియామకాలు చేయడం లేదు. రెగ్యులర్ డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలు లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని హైస్కూళ్లలోనూ ఇదే పరిస్థితి. స్కూల్​ టైంకు టీచర్లు అందుబాటులో ఉండడం లేదు. ఆకస్మిక తనిఖీలు చేసేవారు లేకపోవడంతో ఎవరి ఇష్టం వారిది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. హెచ్ఎంలే ఇన్​చార్జ్ ఎంఈఓలు కావడంతో పట్టించుకోవడం లేదు. 

టీచర్లను  సర్దుబాటు చేస్తున్నాం

టీచర్ల పోస్టులతో పాటు ముఖ్యమైన పోస్టులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమే. ఉన్నంతలో టీచర్లను సర్దుబాటు చేస్తున్నాం. స్టూడెంట్ల చదువుకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. స్టూడెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండి సింగిల్ ​టీచర్ ఉంటే మరో టీచర్​ను సర్దుబాటు చేయాలని ఎంఈఓలకు సూచించాం. 

– సోమశేఖరశర్మ,  ఇన్​చార్జి డీఈఓ, భద్రాద్రి కొత్తగూడెం