కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఇంకెన్నడు?

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఇంకెన్నడు?

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేస్తామన్న సీఎం కేసీఆర్​ హామీ ఏమైందని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. 2014 టీఆర్​ఎస్​ మేనిఫెస్టోలోనూ పెట్టిన ఈ అంశాన్ని ఎందుకు పక్కనపెట్టారని మండిపడ్డారు. కాంట్రాక్ట్​ ఉద్యోగులు, జూనియర్​ లెక్చరర్లకు ఆలస్యంగా జీతాలు రావడం, వాళ్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణపై కేసీఆర్​కు రేవంత్​ బుధవారం లేఖ రాశారు. ‘‘ఆశించినట్టే తెలంగాణ వచ్చినా ఇప్పటికీ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల వెతలు తీరలేదు. క్రమబద్ధీకరణ జరగకపోగా జీతాలివ్వండి మహాప్రభో అని వేడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మే నెలలో రెగ్యులర్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లకూ ఏప్రిల్ జీతం రాలేదు.

 డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లకూ కొన్ని జిల్లాల్లో జీతాలు పెండింగ్​లో ఉన్నాయి. కొన్ని నెలల పాటు టైంకు జీతాలు లేక వందలాది మంది అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి జీతాలు రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారి, ఈఎంఐలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందించడం లేదు” అని రేవంత్ పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీఖునే జీతాలు వచ్చేవి కానీ, కేసీఆర్​ హయాంలో జీతాలు ఎప్పుడొచ్చేదీ తెలియట్లేదని మండిపడ్డారు. 

దమ్ముంటే వరదలపై ట్వీట్ చెయ్

మంత్రి కేటీఆర్​కు ధైర్యం ఉంటే హైదరాబాద్​ సిటీలో వరదలపై ట్వీట్ చేయాలని రేవంత్ సవాల్ చేశారు. ‘మీ ఆస్తులు.. దోస్తుల అంతస్తులు, అద్దాల మేడలు కొలువై ఉన్న ప్రాంతాలపై ట్వీట్లు చేసుడు కాదు కేటీఆర్.. హైదరాబాద్​ గల్లీలు, సామాన్యుడు బతికే కాలనీలు, పేదవాడుండే ప్రాంతాలు కన్నీటిలో కొట్టుకుపోతున్నాయ్. దమ్ముంటే ఆ వాస్తవాలను ట్విట్టర్​లో పెట్టు’ అని పోస్ట్​ చేశారు.