రాష్ట్రం వచ్చినంక ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములకూ రెగ్యులరైజేషన్

రాష్ట్రం వచ్చినంక ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములకూ రెగ్యులరైజేషన్
  • 2020 జూన్ 2 నాటికి కబ్జాలో ఉన్నా ఓకే
  • జీవో 58, 59ని సవరించిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 30 దాకా కొత్తగా అప్లికేషన్ల స్వీకరణ
  • బీఆర్ఎస్ లీడర్ల కబ్జాలోనే ఎక్కువ ల్యాండ్స్
  • వారి కోసమే మార్పులని ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు: 
రాష్ట్రం వచ్చినంక కబ్జా అయిన ప్రభుత్వ భూములను కూడా రెగ్యులరైజ్ చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2020 జూన్ 2వ తేదీ దాకా కబ్జాల్లో ఉన్న భూములను రెగ్యులరైజ్ చేయనున్నట్లు చెప్పింది. గతంలో ఇచ్చిన జీవోలను సవరిస్తూ శుక్రవారం జీవో నంబర్ 29ని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్​మిట్టల్ జారీ చేశారు. 


ఈ సవరణతో కొత్త కబ్జాలకు అవకాశం ఇచ్చినట్లేననే విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేసిన భూములే ఎక్కువగా ఉన్నాయని, వాళ్లకు మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కబ్జా చేసిన ప్రభుత్వ భూముల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, లీడర్లకు చెందిన ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్లతోపాటు బిజినెస్ యాక్టివిటీస్​ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ కార్పొరేషన్లకు చెందిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని మరీ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వాటికి అధికారిక ఆమోద ముద్ర వేసేందుకే ప్రభుత్వం పెంపు నిర్ణయం తీసుకుందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే 3.96 లక్షల దరఖాస్తులు

కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం గతంలో జీవో 58, 59 జీవోలు తెచ్చింది. 2014 జూన్ 2 కంటే ముందు కబ్జా అయిన ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేస్తామని అందులో పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ రూల్‌‌‌‌‌‌‌‌ను ఎత్తివేసింది. అంటే దీని ప్రకారం 2014 జూన్ 2 కటాఫ్ ఉండదు. ఆ తర్వాత జరిగిన కబ్జాలను కూడా క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ దాకా నెల రోజుల పాటు అప్లికేషన్లు తీసుకోనుంది. జీవో 58, 59 కింద రాష్ట్ర సర్కార్ పలుమార్లు అప్లికేషన్లు తీసుకుంది. జీవో నంబర్ 58 కింద 3.48 లక్షల అప్లికేషన్లు, జీవో నంబర్ 59 కింద 48,575 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం 3.96 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో ఎక్కువ వరకు 2014 జూన్ 2 తర్వాత కబ్జాకు గురైన భూములకు సంబంధించినవే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ అప్లికేషన్లను ఓకే చేసి, సర్కారు కటాఫ్ డేట్ ను మరింత పెంచింది. ఫలితంగా ఇంకిన్ని అప్లికేషన్లు రానున్నాయి. రెగ్యులరైజేషన్ కోసం అప్లికేషన్ ఏరోజు అయితే పెట్టుకున్నారో.. ఆ రోజున ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఫీజు వసూలు చేసి భూమిని రెగ్యులరైజ్ చేయనున్నారు. దీంతో ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరనుంది.